నాకైతే సంబంధం లేదు: సుబ్రహ్మణ్యస్వామి

8 Sep, 2020 10:22 IST|Sakshi

ఆ పర్యటనను ప్రధాని మోదీ రద్దు చేయించాలి

బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌పై సుబ్రహ్మణ్య స్వామి ఆగ్రహం

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ రష్యా పర్యటనపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అసహనం వ్యక్తం చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చైనా డిఫెన్స్‌ మినిస్టర్‌ వెయి ఫెంఘెతో భేటీ అయిన తర్వాత మళ్లీ జైశంకర్‌ మాస్కో వెళ్లడం ఎందుకు అని ప్రశ్నించారు. విదేశాంగ విధాన పరంగా.. ఈ ఏడాది మే 5 తర్వాత భారత్‌, చైనాతో పరిష్కరించుకోవాల్సిన సమస్యలేవీ లేవని, అలాంటప్పుడు ఆ దేశ విదేశాంగ మంత్రితో జైశంకర్‌ భేటీ అనవసరం అన్నారు. ఇలాంటి విషయాలు ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలను పలుచన చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే స్పందించి భారత విదేశాంగ మంత్రి రష్యా పర్యటనను రద్దు చేయాల్సిందిగా ట్విటర్‌ వేదికగా విజ్జప్తి చేశారు.(చదవండి: ఎల్‌ఏసీని గౌరవించాలి)

కాగా జూన్‌లో గల్వాన్‌లోయలో చైనా ఆర్మీ ఘాతుకానికి కల్నల్‌ సంతోష్‌ బాబుతో సహా 20 మంది భారత సైనికులు అమరులైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకోగా.. దౌత్య, మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయి. అయినప్పటికీ డ్రాగన్‌ దేశం తన వైఖరి మార్చుకోలేదు. వివిధ స్థాయి చర్చల్లో కుదిరిన బలగాల ఉపసంహరణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దీంతో ఇటీవల మరోసారి వాస్తవాధీన రేఖ( ఎల్‌ఏసీ) వెంబడి ఘర్షణ వాతావరణం తలెత్తింది. 

ఈ క్రమంలో శుక్రవారం మాస్కోలో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సు సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌, చైనా రక్షణ మంత్రి వెయి ఫెంఘెతో దాదాపు రెండు గంటల 20 నిమిషాలపాటు భేటీ అయ్యారు. ఎల్‌ఏసీను చైనా గౌరవించాలని, యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే ప్రయత్నాలు మానుకోవాలని స్పష్టంచేశారు. భారత్‌ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునేందుకు కట్టుబడి ఉందని.. ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల పర్యటనకై జైశకంర్‌ మంగళవారం రష్యాకు బయల్దేరనున్నారు. ఈ సందర్భంగా  డ్రాగన్‌ విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో ఆయన సమావేశం కానున్నట్లు సమాచారం.  

నాకైతే సంబంధం లేదు..
బీజేపీ ఐటీ సెల్‌ విభాగం పనితీరుపై ఆ పార్టీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో పనిచేసే కొంతమంది సభ్యులు నకిలీ ఐడీలతో సోషల్‌ మీడియా వేదికగా తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై తన ఫాలోవర్లు గుర్రుగా ఉన్నారని, కాబట్టి వారు ఎదురుదాడికి దిగే అవకాశం ఉందని, అందుకు తాను బాధ్యత వహించబోనని స్పష్టం చేశారు. ఈ మేరకు.. ‘‘బీజేపీ ఐటీ సెల్‌ దుర్మార్గంగా తయారైంది. అందులోని కొంత మంది సభ్యులు ఫేక్‌ ఐడీలతో నకిలీ ట్వీట్లతో నాపై వ్యక్తిగత దాడులు చేస్తున్నారు. ఒకవేళ నా ఫాలోవర్లు అదే రీతిలో బదులిస్తే అందుకు నేను బాధ్యత వహించను. బీజేపీ ఐటీ సెల్‌ తీరుకు పార్టీ ఎలాగైతే బాధ్యత వహించదో.. అచ్చంగా అలాగే’’ అంటూ ట్విటర్‌ వేదికగా విమర్శలు సంధించారు.

‘‘మాది మర్యాద పురుషోత్తముల పార్టీ. రావణ, దుశ్శాసన ఇక్కడ లేరు. ఇటువంటి విషయాలను నేను పెద్దగా పట్టించుకోను గానీ.. గొడవలు సృష్టించే వాళ్లను బీజేపీ.. పదవి నుంచి తీసేయాలి’’ అంటూ మరో ట్వీట్‌లో ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవీయపై విరుచుకుపడ్డారు. అయితే ఇందుకు గల మూలకారణం గురించి మాత్రం సుబ్రహ్మణ్యస్వామి ప్రస్తావించలేదు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా