మహమ్మారికి వాయువేగం.. ఎయిర్‌బార్న్‌ డిసీజ్‌గా మారే ప్రమాదం 

21 Sep, 2021 02:45 IST|Sakshi

రూటు మారుస్తున్న వేరియంట్లు

వేషము మార్చెను, భాషను మార్చెను, చివరకు తానే మారెను... అని మనిషి పోకడను ఒక సినీ కవి వర్ణించాడు. ప్రస్తుతం కరోనా ఇదే బాటలో పయనిస్తోంది. ఎప్పటికప్పుడు వేషాలు మారుస్తూ మరణ మృదంగం మోత పెంచుతూ వస్తోంది. ఇలాంటి ప్రమాదకారి గాలి ద్వారా ఎక్కువ దూరం, ఎక్కువ వేగంతో వ్యాపించే శక్తిని పొందితే? ఆ ఊహే భయానకంగా ఉంది కదా! కానీ ఈ భయాలు నిజమయ్యే చాన్సుల ఎక్కువయ్యాయి. కోవిడ్‌ కొత్త వేరియంట్లు వాయు మార్గంలో ఎక్కువ దూరం, ఎక్కువ వేగంతో వ్యాపించే శక్తిని సంతరించుకుంటున్నాయి. ఈ శక్తి మరింత ఎక్కువైతే కరోనా ఎయిర్‌బార్న్‌ డిసీజ్‌(గాలిద్వారా వ్యాపించే వ్యాధి)గా మారే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

కరోనా వైరస్‌ ఏరోసాల్స్‌(గాలి తుంపర), డ్రాప్‌లెట్స్‌(సూక్ష్మ బిందువులు) ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. సదరు రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వైరస్‌ దగ్గరలో ఉన్నవారికి, పక్కనే ఉండేవారికి సోకుతుంది. పక్కన ఎవరూ ఆ సమయంలో లేకుంటే క్రమంగా బయటి వాతావరణంలో కరోనా వైరస్‌ నిర్వీర్యం అవుతుంది. కానీ జలుబు లాంటి వైరస్‌లు గాలి ద్వారా కూడా వ్యాపిస్తాయి. వీటి ఏరోసాల్స్‌ ఎక్కువ దూరం పయనిస్తాయి, ఎక్కువకాలం గాల్లో ఉంటాయి. అందుకే ఒక సమూహంలో ఒకరికి జలుబు చేసినా ఇతరులందరికీ తొందరగా అంటుకునే అవకాశాలు ఎక్కువ. కరోనా వైరస్‌ ప్రస్తుతం ఈ శక్తిని సాధించే యత్నాల్లో ఉంది. కరోనా వేరియంట్లు గాల్లో ప్రయాణించడంలో మెలకువలు సాధిస్తున్నాయని, దీనివల్ల కరోనా గాలి ద్వారా వ్యాపించే అవకాశాలు పెరుగుతాయని మేరీల్యాండ్‌ యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది.

దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు మరింత టైట్‌ ఫిట్‌ మాస్కులు ధరించడం, నివాస గృహాల్లో విస్తృత వెంటిలేషన్‌ ఏర్పరుచుకోవడం చేయాలని సూచించింది. అప్పుడే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోగలమని తెలిపింది. ఇప్పటికే కరోనా సోకిన వారు వదిలే గాలిలో వైరస్‌ ఉంటుంది. అల్ఫా వేరియంట్‌ సోకిన వారు వదిలే గాలిలో 43–100 రెట్లు అధిక వైరస్‌లోడు ఉంటుందని అధ్యయనాలు వివరిస్తున్నాయి.  ఇప్పటివరకు ఇవి బయట గాలిలో ఎక్కువ దూరం ప్రయాణించి ఇతరులకు సోకడం జరగలేదు.  అయితే క్రమంగా వాయు ప్రయాణం చేసే శక్తిని వేరియంట్లు పెంచుకుంటున్నాయని, దీనివల్ల వైరల్‌ ఏరోసాల్స్‌ పెరిగిపోతున్నాయని సీఐడీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం తెలిపింది.

టీకా ప్లస్‌ మాస్క్‌ 
అల్ఫాతో పోలిస్తే డెల్టా వేరియంట్‌కు అధిక సంక్రమణ శక్తి కలిగిఉన్నట్లు అధ్యయనంలో పాల్గొన్న ప్రొఫెసర్‌ డాన్‌ మిల్టన్‌ చెప్పారు. ఈ వేరియంట్లు క్రమంగా గాల్లో ప్రయాణించడాన్ని అలవరుచుకుంటున్నాయన్నారు. ఇవి పూర్తిగా వాయుమార్గంలో సోకే వేరియంట్లుగా మారకుండా నిరోధించేందుకు టీకా తీసుకోవడం, టైట్‌ మాస్కులు ధరించడం, శుభ్రమైన వాతావరణంలో నివసించడం చేయాలన్నారు. అల్ఫా కన్నా డెల్టాలో ఈ శక్తి ఎక్కువగా కనిపిస్తోందని, దీన్నిబట్టి వైరస్‌లో వాయుప్రయాణ అనుకూల మార్పులు పెరుగుతున్నాయని డాక్టర్‌ లాయ్‌ చెప్పారు. ఇప్పటికీ మాస్కులు కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కీలక పాత్ర పోషిçస్తూనే ఉన్నాయన్నారు. మాస్కుల వల్ల వైరస్‌సోకే అవకాశాలు దాదాపు 50 శాతం తగ్గుతాయని వివరించారు. కానీ లూజుగా ఉండే దుస్తులు, సర్జికల్‌ మాస్కుల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని తెలిపారు.  

మరిన్ని వార్తలు