పంజాబ్‌లో కొన్నట్టే ఇక్కడా కొంటున్నాం: కేంద్రం వివరణ

12 Apr, 2022 03:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌/న్యూఢిల్లీ:  ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ పట్ల ఎలాంటి వివక్ష చూప డం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పంజాబ్‌లో ధాన్యాన్ని కొనుగోలు చేసిన తరహాలోనే దేశమంతటా ఒకే విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపింది. దీనికి సంబంధించి టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే పేర్కొన్నారు.

తెలంగాణలో యాసంగి ధాన్యం కొనాల్సిందేనంటూ సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఢిల్లీలో దీక్ష చేపట్టిన నేపథ్యంలో సుధాంశుపాండే మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో డీసెంట్రలైజ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ విధానం (డీసీపీ)లో బియ్యం సేకరిస్తున్నామని.. పంజాబ్‌ నుంచి నాన్‌ డీసీపీ విధానంలో సెంట్రల్‌ పూల్‌ ద్వారా బియ్యం సేకరించి ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నామని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ నేటిదాకా ఒకే విధానం అమల్లో ఉందని చెప్పారు. తెలంగాణ అవసరాలకు వినియోగించుకోగా మిగిలిన బియ్యాన్ని సెంట్రల్‌ పూల్‌ కింద ఎఫ్‌సీఐకి అప్పగిస్తోందని గుర్తు చేశారు.

ఇన్నాళ్లూ ఏటా యాసంగిలో పండిన పంటను బాయిల్డ్‌ రైస్‌గా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగిస్తోందన్నారు. అదే పంజాబ్‌ అయితే ఖరీఫ్‌ సీజన్‌లో మాత్రమే వరి పండించి బియ్యాన్ని సెంట్రల్‌ పూల్‌ కింద ఎఫ్‌సీఐకి అప్పగిస్తుందని.. రబీలో గోధుమలను పండిస్తోందని వివరించారు. పంజాబ్‌ నుంచి కేంద్రం బాయిల్డ్‌ రైస్‌ తీసుకోవడం లేదని.. ఆ రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరకు ధాన్యం సేకరిస్తోందని తెలిపారు. 

రాష్ట్రం ఒప్పుకున్నాకే.. 
తెలంగాణతోపాటు దక్షిణ భారతదేశం నుంచి ఎఫ్‌సీఐ సేకరించే బాయిల్డ్‌ రైస్‌ను సెంట్రల్‌ పూల్‌ కింద కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు పంపిస్తామని సుధాంశు పాండే తెలిపారు. తెలంగాణ కూడా పశ్చిమ బెంగాల్, బిహార్‌లకు బాయిల్డ్‌ రైస్‌ను పంపుతుందన్నారు. తెలంగాణలో బాయిల్డ్‌ రైస్‌ వినియోగం లేనందున మొత్తం బియ్యాన్ని ఎఫ్‌సీఐకే పంపిస్తూ వస్తోందన్నారు. దేశంలో ప్రస్తుతం నాలుగేళ్లకు సరిపడా బాయిల్డ్‌ రైస్‌ నిల్వలు ఉన్నందున తెలంగాణ నుంచి రా రైస్‌ మాత్రమే సేకరిస్తామని ముందే చెప్పామని.. రాష్ట్ర ప్రభుత్వం దీనికి అంగీకరించి ఒప్పందంపై సంతకం కూడా చేసిందని వివరించారు. అంతేగాకుండా 2021–22 యాసంగి ధాన్యం సేకరణ ప్రతిపాదనను 
తెలంగాణ పంపలేదని చెప్పారు.


 

మరిన్ని వార్తలు