అక్కా.. ఇచ్చేశా..

13 Apr, 2023 03:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  మనీలాండరింగ్‌ కేసులో జైలులో ఉన్న సుకేశ్‌ చంద్రశేఖర్‌.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి మరో సంచలన లేఖ విడుదల చేశారు. హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యాలయంలో ఏపీ అనే వ్యక్తికి రూ.15 కోట్లు అందజేశానంటూ గతంలో లేఖ రాయగా.. తాజాగా నేరుగా పేర్లను ప్రస్తావిస్తూ మరో లేఖను, వాట్సాప్‌ చాటింగ్‌ల స్క్రీన్‌ షాట్లను విడుదల చేశారు. ఆ సొమ్ము అందజేసే క్రమంలో ఎమ్మెల్సీ కవితతో పలుసార్లు కోడ్‌ పేర్లతో వాట్సాప్‌ చాటింగ్‌ చేశానని లేఖలో పేర్కొన్నారు.

అంతేగాకుండా ఢిల్లీ లిక్కర్‌  స్కామ్‌లో ఆప్‌ నేతలకు, ఎమ్మెల్సీ కవితకు మధ్య ఆర్థిక సంబంధాలకు సంబంధించి తాను బయటపెట్టే అంశాల ఆధారంగా.. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని వెల్లడించారు. తన దగ్గరున్న 703 వాట్సాప్‌ స్క్రీన్‌ షాట్‌లలో.. రెండింటిని విడుదల చేస్తున్నానని.. వీటిపై దర్యాప్తు చేయాలని సుప్రీం సీజే, కేంద్ర హోంమంత్రి, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్, సీబీఐ, ఈడీ డైరెక్టర్లను కోరారు. 
 
సుకేశ్‌ లేఖలో పేర్కొన్న అంశాలివీ.. 
‘‘ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన, అధికారంలో ఉన్న వ్యక్తులతోపాటు అవినీతిపై పలు ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్న వ్యక్తులకు మధ్య జరిగిన వాట్సాప్‌ చాటింగ్‌ల స్క్రీన్‌షాట్లను మీ దృష్టికి తీసుకొచ్చాను. నేను విజిల్‌ బ్లోయర్‌గా ఉండి ఇప్పటికే స్టేట్‌మెంట్లు ఇచ్చాను. నా దగ్గరున్న 703 వాట్సాప్‌ స్క్రీన్‌షాట్ల నుంచి రెండింటిని అందిస్తున్నా. దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని కోరుతున్నా. ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్, మాజీ మంత్రులు సత్యేంద్ర జైన్, మనీశ్‌ సిసోడియా, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత, కైలాశ్‌ గెహ్లోత్‌లతో 2015 నుంచీ పలు లావాదేవీల్లో భాగస్వామిని అయ్యాను.

దర్యాప్తు చేయదగిన పత్రాల్లో నేను చెప్తున్న అంశాలు కూడా కీలకమైనవే. అరవింద్‌ కేజ్రీవాల్, ఆయన సహచరులు.. సౌత్‌ గ్రూపు, ఇండోస్పిరిట్స్‌ సంస్థ యజమానులు అరుణ్‌ పిళ్‌లై, ఎమ్మెల్సీ కవితలతో చురుకుగా సంప్రదింపులు చేసినట్టు స్పష్టమవుతోంది. 2020లో కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్‌ల సూచన మేరకు హైదరాబాద్‌లోని నా సిబ్బంది ద్వారా బీఆర్‌ఎస్‌కు చెందిన కవితకు డెలివరీ చేసిన లావాదేవీ చాటింగ్‌లు ఇవి. సత్యేంద్ర జైన్‌తో నా చాట్‌ వివరాలు జత చేశాను.

కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్‌ల సూచన మేరకు ఎమ్మెల్సీ కవితకు హైదరాబాద్‌లో రూ.15 కోట్లు ఇచ్చిన దానికి చెందిన చాటింగ్‌లు ఇవి. ఢిల్లీ మద్యం లైసెన్సుల నిమిత్తం కేజ్రీవాల్‌తో కవిత ఆర్థిక లావాదేవీలు జరిగాయి. కిక్‌బ్యాక్‌ అయిన మొత్తం హైదరాబాద్‌ నుంచి హవాలా రూపంలో పలు ఆసియా దేశాలకు (ఆప్‌కు అనుకూలంగా ఉన్న) పంపారు. ఢిల్లీ నుంచి ఎలాంటి లావాదేవీలు నిర్వహించరాదని కేజ్రీవాల్‌ ప్రత్యేకంగా పేర్కొన్నారు. దీంతో అన్ని క్యాష్‌ లావాదేవీలు కరోనా కాలంలో హైదరాబాద్‌ నుంచి చేపట్టారు’’ అని సుకేశ్‌ తన లేఖలో పేర్కొన్నారు. 

నాపై ఒత్తిడి ఉంది.. వెంటనే దర్యాప్తు చేయాలి.. 
ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌ల నుంచి తనపై, తన కుటుంబంపై తీవ్ర ఒత్తిడి ఉందని.. అందువల్ల తాను వెల్లడించిన అంశాలపై వెంటనే దర్యాప్తు చేయాలని సుకేశ్‌ లేఖలో కోరారు. దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తానన్నారు. తనకు, ఆమ్‌ఆద్మీ పార్టీ, అర్వింద్‌ కేజ్రీవాల్‌కు మధ్య అనేక రకాల ఒప్పందాలు, వ్యాపార లావాదేవీలు ఉన్నాయన్నారు.

ఢిల్లీ మద్యం విధానంపై దర్యాప్తు కొనసాగుతున్నందున.. అందులో ప్రమేయమున్న ఆప్, కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత మధ్య సంబంధాలను ఈ చాటింగ్‌ వివరిస్తుందని.. దర్యాప్తునకు తోడ్పడుతుందని వివరించారు. ఆప్‌ సీనియర్‌ నేతలతో జరిపిన అన్ని లావాదేవీల వాయిస్‌ రికార్డులు, ఇతర చాటింగ్‌లను అందించడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా సొంతంగానే చాటింగ్‌ల వివరాలు అందిస్తునన్నాని.. దీనిపై జోక్యం చేసుకోవాలని సీజేఐ, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్, కేంద్ర హోంమంత్రి, సీబీఐ, ఈడీ డైరెక్టర్లకు విజ్ఞప్తి చేశారు. 
 
కవితతో సుకేశ్‌ చాటింగ్‌గా పేర్కొన్న సంభాషణ ఇదీ 

సుకేశ్‌: అక్కా మిమ్మల్ని డిస్టర్బ్‌ చేస్తున్నా.. కొన్ని వివరాలు కావాలి. 
– హాయ్‌.. ఇపుడే మెసేజ్‌ చూశాను 
సుకేశ్‌: ఇబ్బందేమీ లేదు అక్కా.. ఏకే ప్యాకేజీని మీకు ఇవ్వాల్సి ఉంది. నా దగ్గర సిద్ధంగా ఉంది. 
– ఎస్‌.. ఓకే 
సుకేశ్‌: దీన్ని జేహెచ్‌ ఇంటికి పంపించనా? 
– వద్దు వద్దు. అరుణ్‌కు నేను ఫోన్‌ చేసి నీతో మాట్లాడుమని చెప్తా. దీన్ని ఆఫీస్‌కు పంపాల్సి ఉంటుంది. 
సుకేశ్‌: ఓకే అక్కా.. మీరు చెప్పినట్లే చేస్తా.. 
– అతను కొద్దిసేపట్లో ఫోన్‌ చేస్తాడు. 
సుకేశ్‌: సరే అక్కా.. ఎస్‌జే బ్రదర్‌ ఈ రోజే మీకు అందజేయాలని చెప్పారు. 
– ఎస్‌ 
సుకేశ్‌: నేను కో–ఆర్డినేట్‌ చేసుకుంటా అక్కా. 
– మీ వైపు నుంచి అంతా ఓకే కదా.. మీ డాడీకి ఆరోగ్యం ఎలా ఉంది? 
సుకేశ్‌: డాడీ గురించి అడిగినందుకు కృతజ్ఞతలు అక్కా.. ప్రస్తుతం కెమో థెరపీ చేస్తున్నారు. 
– ఆయన త్వరగా కోలుకుని రావాలని కోరుకుంటున్నా.. 
సుకేశ్‌: ఎస్‌ అక్కా.. దేవుడు కూడా అదే చేస్తాడని అనుకుంటున్నా.. 
– టేక్‌ కేర్‌.. నేను మళ్లీ మాట్లాడుతా.. 
సుకేశ్‌: ఒకే అక్కా మీ ఇష్టం ఎప్పుడైనా చేయండి. కేసీఆర్‌ గారిని అడిగినట్టు చెప్పండి 
– నమస్తే (ఎమోజీ) 
సుకేశ్‌: అక్కా డెలివరీ చేసేశాను 
– ఓకే 
సుకేశ్‌: అక్కా.. ఏకే గారికి లేదా ఎస్‌జేకు ఇన్‌ఫార్మ్‌ చేయండి 
– మనీష్‌తో మాట్లాడాను 
సుకేశ్‌: ఓకే అక్కా.. థ్యాంక్స్‌ 

 
సత్యేంద్ర జైన్‌తో సుకేశ్‌ చాటింగ్‌గా పేర్కొన్న సంభాషణ ఇదీ 

– బోలో 
సుకేశ్‌: బ్రదర్‌ ఇంకో నంబర్‌ సరిగ్గా పనిచేయడం లేదు 
– బ్యాటరీ లో 
సుకేశ్‌: ఓకే బ్రో.. బ్రో నెయ్యి టిన్‌ రెడీ 
– ఫుల్‌ కదా 
సుకేశ్‌: ఎస్‌ బ్రో.. 15 కేజీలు 
– దాన్ని హైదరాబాద్‌ సిస్టర్‌కు పంపించు 
సుకేశ్‌: బ్రో ఢిల్లీలో కాదా? 
– కాదు కాదు హైదరాబాద్‌లో.. 
సుకేశ్‌: ఓకే బ్రో.. పంపిస్తా.. 
– టైమ్‌? 
సుకేశ్‌: రెండు గంటలు టైమ్‌ ఇవ్వండి 
– సాయంత్రం ఐదు గంటలకల్లా ఇవ్వాలి 
సుకేశ్‌: ఓకే బ్రో.. మరి బిగ్‌ బ్రోకు కూడా ఇన్‌ఫార్మ్‌ చేయండి.. లేదా నన్నే చేయమంటారా? 
– ఏకే భాయ్‌కు తెలుసు.. ఆయన ఫేస్‌ టైమ్‌లో 3 గంటలకు మాట్లాడతారు 
సుకేశ్‌: ఓకే మై బ్రో.. 

సుకేశ్‌ చాటింగ్‌లలో పేర్కొన్న కోడ్‌ల పేర్లు 
చాట్‌–1లో.. 
ఏకే బ్రో: అరవింద్‌ కేజ్రీవాల్‌ 
ఎస్‌జే బ్రో: సత్యేంద్ర జైన్‌  
మనీశ్‌: మనీశ్‌ సిసోడియా 
అరుణ్‌: అరుణ్‌ పిళ్‌లై 
జేహెచ్‌: జూబ్లీహిల్స్‌లోని కవిత నివాసం 
ఆఫీస్‌: బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం 
ప్యాకేజీ: రూ.15 కోట్ల నగదు 

 
చాట్‌–2లో.. 

బ్రో: సత్యేంద్ర జైన్‌ 
15 కేజీల నెయ్యి: రూ.15 కోట్ల క్యాష్‌ 
25 కేజీల నెయ్యి: రూ.25 కోట్ల క్యాష్‌ 
హెచ్‌వైడీ: హైదరాబాద్‌ 
సిస్టర్‌: కవిత 
ఏకే భాయ్‌: అరవింద్‌ కేజ్రీవాల్‌   

మరిన్ని వార్తలు