నటికి రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు పంపిన సుఖేష్‌

11 Feb, 2023 16:52 IST|Sakshi

ముంబై: మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన సుఖేష్ చంద్రశేఖర్ బాలీవుడ్ నటి ఛాహత్ ఖన్నాకు రూ.100కోట్ల పరువు నష్టం దావా నోటీసులు పంపాడు. తనపై చేసిన ఆరోపణలకు వారం రోజుల్లో క్షమాపణలు చెప్పాలని, లేదంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధం కావాలని అతని తరఫు న్యాయవాది హెచ్చరించాడు. ఛాహత్ ఖాన్నా చేసిన ఆరోపణల వల్ల సుఖేష్ పరువు పోయిందని, మానసికంగా వేధనకు గురయ్యాడని న్యాయవాది పేర్కొన్నాడు.

పలు బాలీవుడ్ సినిమాలతో పాటు, సీరియళ్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఛాహత్ ఖన్నా. ముఖ్యంగా 'బడే అచ్చే లగ్తే హై' సీరియల్‌తో బాగా పాపులర్ అయ్యింది. అయితే ఈమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుఖేశ్ తనను కూడా మోసం చేసేందుకు ప్రయత్నించాడని, తిహార్ జైల్లో అతడ్ని కలిసినప్పుడు పెళ్లి చేసుకుంటాని ప్రపోజ్ చేశాడని ఆరోపించింది.

'ఢిల్లీలో ఈవెంట్ ఉందని చెప్పి ఏంజెల్ ఖాన్‌(పింకీ ఇరానీ) అనే మహిళ నన్ను తీసుకెళ్లింది. తీహార్ జైలు రోడ్డు మార్గం నుంచి వెళ్లాలని పేర్కొంది. ఆ తర్వాత జైలు వద్ద ఆపి లోపలికి తీసుకెళ్లింది. అక్కడ సుఖేష్ చంద్రశేఖర్ నన్ను కలిశాడు. బ్రాండెడ్ షర్టు వేసుకొని బాగా సెంటు రాసుకొని మెడలో గోల్డ్ చైన్ ధరించి ఉన్నాడు. తాను ఓ సౌత్ ఇండియా టీవీ ఛానల్ ఓనర్‌నని, జే జయలలిత మేనల్లుడినని పరిచయం చేసుకున్నాడు. ఈవీఎం ట్యాంపరింగ్ కేసులో ఆరెస్టయ్యానన్నాడు. అసలు నన్ను ఇక్కడకు ఎందుకు పిలిపించారు? ఆరు నెలల బిడ్డను వదిలేసి వచ్చా అని నేను చెప్పా. అప్పుడు అతను నేనంటే ఇష్టం ఇన్నాడు. బడే అచ్చే లగ్తే హై సీరియల్‌లో నా నటన చూసి ఫ్యాన్ అయ్యానని చెప్పాడు. మోకాలిపై కూర్చొని నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు.

దీంతో నేను అతనిపై అరిచా. నాకు పెళ్లైంది. ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పా. నా భర్త నాకు సరైనోడు కాదని, తాను ఎంతగానో ప్రేమిస్తున్నాని సుఖేష్ చెప్పాడు. నేను కోపంతో అక్కడి నుంచి వచ్చేశా.  ఆ తర్వాత నేను తిహార్ జైలుకు వెళ్లిన వీడియో  చూపించి ఒకరు రూ.10లక్షలు ఇవ్వమని బెదిరించారు. దీంతో నేను జైలుకు వెళ్లిన విషయం ఎవరికీ తెలియవద్దని, తన పెళ్లిపై ప్రభావం పడొద్దని ఆ డబ్బు వాళ్లకు ఇచ్చేశా. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. నా భర్త నుంచి విడిపోవాల్సి వచ్చింది. నేను ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండాల్సింది. కానీ ఒకదాని తర్వాత మరొకటి వరుసగా జరుగుతూనే ఉన్నాయి. వాటన్నింటి నుంచి నేను బయటపడాలనుకున్నా.' అని ఛాహత్ ఖన్నా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

కాగా.. సుకేశ్ చంద్రశేఖర్ రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ ఎదుర్కొన్నారు.
చదవండి:  మైనర్‌తో బాడీ మసాజ్‌ చేయించుకున్న క్రికెట్‌ కోచ్‌

మరిన్ని వార్తలు