సుఖోయ్, మిరాజ్‌ ఢీ.. పైలట్‌ మృతి

29 Jan, 2023 05:57 IST|Sakshi

మరో ఇద్దరికి గాయాలు

మధ్యప్రదేశ్‌లో ఘటన

న్యూఢిల్లీ/భరత్‌పూర్‌/మొరెనా: భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌)నకు చెందిన సుఖోయ్‌ 30ఎంకేఐ, మిరాజ్‌–2000 యుద్ధ విమానాలు ఢీకొన్న అరుదైన ఘటనలో ఒక పైలెట్‌ మృతి చెందారు. మరో ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం గ్వాలియర్‌కు సమీపంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఐఏఎఫ్‌ బేస్‌గా ఉన్న గ్వాలియర్‌ విమానాశ్రయం నుంచి ఈ రెండు విమానాలు రోజువారీ సాధారణ శిక్షణలో భాగంగా బయలుదేరాయి.

మొరెనా జిల్లా పహర్‌గఢ్‌ సమీపంలోని బహిరంగ ప్రదేశంలో అవి ప్రమాదవశాత్తు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఘటనలో సింగిల్‌ సీటర్‌ మిరాజ్‌–2000 పైలెట్‌ వింగ్‌ కమాండర్‌ హనుమంతరావు సారథి చనిపోగా ట్విన్‌ సీటర్‌ సుఖోయ్‌ ఫ్లయిట్‌లోని ఇద్దరు పైలెట్లు ఎజెక్ట్‌ అయి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతి చెందిన వింగ్‌ కమాండర్‌ శరీర భాగాలు పహార్‌గఢ్‌ ప్రాంతంలో లభ్యమైనట్లు అధికారులు తెలిపారు.

విమాన శకలాలు కొన్ని పొరుగునే ఉన్న రాజస్తాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లాలోనూ పడిపోయాయి. దీనిపై ఐఏఎఫ్‌ దర్యాప్తునకు ఆదేశించింది. ఘటనకు సంబంధించిన వివరాలను ఐఏఎఫ్‌ చీఫ్‌ వీఆర్‌ చౌధరి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు వివరించారు. ఫ్లయిట్‌ డేటా రికార్డుల విశ్లేషణ అనంతరమే ఘటనకు దారి తీసిన కారణాలు తెలుస్తాయన్నారు. ఐఏఎఫ్‌ చరిత్రలో మిరాజ్, సుఖోయ్‌ ఢీకొనడం ఇదే తొలిసారి. దేశంలో గత 70 ఏళ్లలో ఇలాంటి 64 ప్రమాదాల్లో 39 మంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారని వైమానిక నిపుణుడు అంచిత్‌ గుప్తా తెలిపారు.

మరిన్ని వార్తలు