శ్రీరాముని మూల విరాట్టుపై సూర్య కిరణాలు

18 Oct, 2021 03:18 IST|Sakshi

అయోధ్య రామాలయం ట్రస్ట్‌ బోర్డు సభ్యుడి వెల్లడి

న్యూఢిల్లీ: సూర్య భగవానుని కిరణాలు ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున అయోధ్య భవ్య రామమందిరం గర్భగుడిలోని శ్రీరాముని విగ్రహంపై పడేలా నిర్మాణం చేపడతామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ సభ్యుడు కామేశ్వర్‌ చౌపల్‌ వెల్లడించారు. ఒడిశా కోణార్క్‌లో సూర్యదేవాలయం నిర్మాణాన్ని స్ఫూర్తిగా తీసుకుని, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో చర్చలు జరిపి ఈ మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

పవిత్ర గర్భగుడిలోకి సూర్య కిరణాలు ప్రసరించేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. ఇందుకోసం, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్, ఢిల్లీ, ముంబై, రూర్కీ ఐఐటీలకు చెందిన నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. రామాలయ నిర్మాణం శరవేగంగా సాగుతోందని ట్రస్ట్‌ అధికారి ఒకరు చెప్పారు. 2023 డిసెంబర్‌ కల్లా గర్భగుడి నిర్మాణం పూర్తి చేసుకుని, భక్తుల దర్శనానికి సిద్ధమవుతుందని అన్నారు. ఇప్పటికే మొదటి దశ పునాది నిర్మాణం పూర్తయిందనీ, రెండో దశ నవంబర్‌ 15 నుంచి మొదలవుతుందని చెప్పారు. పిల్లర్ల నిర్మాణం ఏప్రిల్‌ 2022 నుంచి మొదలవుతుందన్నారు. 

మరిన్ని వార్తలు