మోదీ రైతు పక్షపాతి: సన్నీ డియోల్‌

7 Dec, 2020 20:15 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్రం​ ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు నిరసనలు పన్నెండు రోజులకు చేరిన నేపథ్యంలో గుర్‌దాస్‌పూర్‌ బీజేపీ ఎంపీ నటుడు సన్ని డియోల్‌ మౌనం వీడారు.  ఈ మేరకు ఆదివారం ట్విటర్‌లో స్పందించారు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం  రైతులకు అండగా ఉంటూ వారి శ్రేయస్సు కోసం పాటుపడుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు ఎంతగానో మేలు చేకూర్చేవని ట్వీట్‌‌ చేశారు.

బిల్లుల సమస్య కేంద్ర ప్రభుత్వం రైతులకి సంబంధించిదని వారి మధ్య ఎవరూ జోక్యం చేసుకోవద్దని కోరారు. సమస్యను చర్చల ద్వారా  పరిష్కరించుకోవాలని, కాని కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం రైతుల గురించి ఆలోచించకుండా సమస్యను మరింత జఠిలం చేస్తున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో వెన్నంటి ఉన్నకార్యకర్త దీప్‌ సిద్దూ ప్రస్తుతం తనతో లేడని, నిరసనలకు అనుకూలంగా ఖలీస్తాన్‌ను సాకుగా చూపిస్తూ అతను మాట్లాడిన వ్యాఖ్యలకు  తనకెలాంటి సంబంధం లేదని సన్ని స్పష్టం చేశారు. 

తానెప్పుడు రైతు పక్షపాతినేనని, రైతుల క్షేమం కోసం తమ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని.. రైతులతో చర్చల తర్వాత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. పంజాబ్‌ హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు బిల్లులకు వ్యతిరేకంగా నవబంర్‌ 26 నుంచి రాజధాని దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న నేపథ్యంలో డిసెంబర్‌ 8 న భారత్‌ బంద్‌కి పిలుపునిచ్చారు. ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్టంబను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం డిసెంబర్‌ తొమ్మిదిన ​రైతు సంఘాల నాయకులతో మరోసారి చర్చలు జరపనుంది.

మరిన్ని వార్తలు