ప్రాణాలు కాపాడాల్సిన వాళ్లం.. ఓ వైద్యుడి భావోద్వేగం

22 Apr, 2021 19:18 IST|Sakshi

కరోనాతో ఊపిరాడని భారతం

వేధిస్తున్న ఆక్సిజన్‌ కొరత  సంక్షోభం 

వైద్యుల మానసిక క్షోభ

సాక్షి, న్యూఢిల్లీ:  దేశవ్యాప్తగా కరోనా మహమ్మారి విలయం రోజుకు రోజుకు మరింత ఉధృతమవుతోంది. దీంతో  దేశంలో ఏ ఆసుపత్రిలో చూసినా ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా కోవిడ్‌-19 ప్రభావిత రాష్ట్రం ఢిల్లీలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దీంతో ప్రాణాలను పణంగా పెట్టి మరీ  కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. బాధితులు ఊపిరాడక తమ కళ్లముందే విలవిల్లాడుపోతోంటే తీవ్ర మానసిక వేదన చెందుతున్నారు. ఆసుపత్రిలో దుర్భర పరిస్థితి,  రోగుల ప్రాణాలను  కాపాడలేని  తమ నిస్సహాయతపై ఒక సీనియర్‌ వైద్యుడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియో  వైరల్‌ అవుతోంది

దేశ రాజధాని నగరంలో  ఢిల్లీలోని అతిపెద్ద ఆసుపత్రులు ఆక్సిజన్‌  కొరతతో అల్లకల్లోలమవుతున్నాయి.  దీనిపై ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా సీరియస్‌గా స్పందించాయి. తక్షణమే అన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా  వైద్య సదుపాయాలు,  రోగుల ప్రమాదకర పరిస్థితుల గురించి మాట్లాడుతున్నప్పుడు శాంతి ముకాండ్ హాస్పిటల్ సీఈవో డాక్టర్ సునీల్ సాగర్ కంట తడిపెట్టారు. వైద్యులుగా రోగుల ప్రాణాలను కాపాడాల్సిన తాము, కనీసం ఆక్సిజన్‌ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామంటూ  తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.  అందుకే డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్న చాలామందిని  డిశ్చార్జ్ చేయవలసిందిగా వైద్యులను కోరామని, చాలా  క్రిటికిల్‌ గా ఉన్న వారికి ఐసీయూ బెడ్స్‌, ఆక్సిజన్‌ అందిస్తున్నామన్నారు.  ప్రాణాలను  నిలపాల్సిన  తాము  చివరికి ఆక్సిజన్ కూడా ఇవ్వలేకపోతే... పరిస్థితి ఏమిటి... వారు చనిపోతారంటూ  ఉద్వేగానికి  లోనయ్యారు. ఆసుపత్రిలో  ఉన్న స్టాక్స్  మహా అయితే రెండు గంటలకు సరిపోతుందని డాక్టర్ సాగర్ చెప్పారు. తమ రెగ్యులర్ సరఫరాదారు ఐనాక్స్ కాల్స్‌కు స్పందించడం మానేసిందని ఆరోపించారు.

మరోవైపు రోహిణి సరోజ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో, 51 ఏళ్ల ఆశిష్ గోయల్ వెంటిలేటర్‌లో ఉన్న తన తండ్రికి ఆక్సిజన్‌ కోసం చాలా ఇబ్బందులనెదుర్కాను. అయితే 15 నిమిషాలకు సరిపడా ఆక్సిజన్‌ మాత్రమే తమ దగ్గర ఉందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. దీంతో చాలా భయంకరంగా ఉంది.. తమకు ఎవరూ రక్షణ లేరంటూ బావురుమన్నారు గోయల్‌. అటు ఘజియాబాద్‌లోని లక్ష్మీచంద్ర ఆసుపత్రి అంబులెన్స్‌లు ఇప్పుడు రోగులకు బదులుగా ఆక్సిజన్ రీఫిల్స్‌  సిలిండర్లను  రవాణా చేస్తున్నాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.  మరోవైపు  ఉత్తరప్రదేశ్‌లోని అదే జిల్లాలోని చంద్రలక్ష్మి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ గోయల్, " మా వద్ద  ఆక్సిజన్ లేదు, మందులు లేవు.. పేషంట్లను స్వీకరించలేను క్షమించండి’’ అంటూ  ఏకంగా బోర్టు పెట్టేశారు. ఆసుపత్రిని స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ జిల్లా యంత్రాంగానికి లేఖ రాయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాజధానిలోని ఆరు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు అయిపోయాయంటూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గురువారం ఒక జాబితా  విడుదల చేశారు. సరోజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శాంతి ముకుంద్ హాస్పిటల్, తీరత్ రామ్ షా హాస్పిటల్, యూకే నర్సింగ్ హోమ్, రాఠి హాస్పిటల్ , శాంటం హాస్పిటల్  ఇందులోఉన్నాయి.  (వ్యాక్సిన్‌ తరువాత పాజిటివ్‌ : ఐసీఎంఆర్‌ సంచలన రిపోర్టు)

చదవండి : ఎన్నిసార్లు గెలుస్తావ్‌ భయ్యా..! నెటిజన్లు ఫిదా

మరిన్ని వార్తలు