ఆ ఖాతాలకు సుప్రీం రక్షణ

4 Sep, 2020 03:55 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆగస్ట్‌ 31 వరకు నాన్‌ పెర్ఫార్మింగ్‌ అసెట్స్‌ (ఎన్‌పీఏ)గా గుర్తించని ఖాతాలకు సుప్రీం కోర్టు రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఆ ఖాతాలను తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ‘ఎన్‌పీఏ’లుగా ప్రకటించవద్దని బ్యాంకులను ఆదేశించింది. కోవిడ్‌–19 కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రుణగ్రహీతలకు ఊరట కల్పించేందుకు ఉద్దేశించిన మారటోరియం సమయంలోనూ.. రుణ వాయిదాలపై బ్యాంకులు వడ్డీ విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లకు సంబంధించి జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పై ఆదేశాలిచ్చింది.

కనీసం 2 నెలల పాటు ఏ ఖాతాను కూడా ఎన్‌పీఏగా నిర్ధారించబోమని బ్యాంక్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. ఆర్థిక రంగానికి బ్యాంకింగ్‌ వ్యవస్థ వెన్నెముక వంటిదని, కరోనా కారణంగా అన్ని రంగాలు కుదేలై ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వివరించారు. ఆర్థిక రంగ పునరుత్తేజాన్ని రుణాల వడ్డీ మాఫీ నిర్ణయం దెబ్బతీస్తుందన్న విషయం ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందిన విషయమన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. తమ ఆందోళన అంతా వడ్డీపై వడ్డీకి సంబంధించి అని స్పష్టం చేసింది. వాదనల అనంతరం తదుపరి విచారణను 10కి వాయిదా వేసింది. మారటోరియం సందర్భంగా ఇన్‌స్టాల్‌మెంట్‌ చెల్లింపులను వాయిదా వేసుకున్న ఖాతాలపై వడ్డీ  మాఫీ ఆర్థిక విధానాలకు వ్యతిరేకమని గతంలో కేంద్రం తెలిపింది.

మరిన్ని వార్తలు