సుప్రీంకోర్టులో థాక్రేకు మళ్లీ ఎదురుదెబ్బ.. సీఎం షిండే వర్గానికి గడువిచ్చిన సుప్రీం

20 Jul, 2022 15:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: శివసేన చీఫ్‌ ఉద్ధవ్ ఠాక్రేకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. పార్టీపై ఆధిపత్యం కోసం థాక్రే, సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గాలు దాఖలు చేసిన పిటిషన్ల విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అప్పటిలోగా ఏక్‌నాథ్ షిండే వర్గం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఎమ్మెల్యేల అనర్హత విషయానికి సంబంధించి స్పీకర్‌ కూడా అప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని స్పష్టం చేసింది. దీంతో థాక్రే వర్గానికి మళ్లీ నిరాశే ఎదురైంది.

ఈ పిటిషన్లలోని కొన్ని విషయాలను పరిశీలిస్తే.. వీటి విచారణకు విస్తృత ధర్మాసనం అవసరం అవుతుందని బలంగా నమ్ముతున్నట్లు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సూచనప్రాయంగా తెలిపారు. దీంతో ఈ పిటిషన్ల కోసం ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక ధర్మానాన్ని ఏర్పాటు చేసే అవకాశం కన్పిస్తోంది.

షిండే వర్గం చేసిన పనిని సమర్థిస్తే దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలన్నీ కూలిపోయే పరిస్థితి వస్తుందని థాక్రే వర్గం తరఫున వాదనలు వినిపించిన కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలను పడగొడితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందన్నారు.

మరోవైపు షిండే వర్గం తరఫున సీనియర్ అడ్వకేట్‌  హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. అనర్హత వేధింపుల వల్ల పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి మనుగడ ఉండదని కోర్టుకు చెప్పారు. థాక్రే వర్గం పిటిషన్లపై తాము అఫిడవిట్ దాఖలు చేసేందుకు కాస్త గడువు కావాలని, కేసును వచ్చేవారం వాయిదా వేయాలని కోరారు. వాదోపవాదనలు విన్న న్యాయస్థానం విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసింది.

శివసేన రెబల్ ఎమ్మెల్యేల అనర్హత విషయం పెండింగ్‌లో ఉండగానే.. షిండే వర్గాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ అనుమతించడాన్ని థాక్రే వర్గం సవాల్ చేసింది. పార్టీ విప్‌ను దిక్కరించి కొందరు ఎమ్మెల్యేలు స్పీకర్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారని, వారిపైనా చర్యలు తీసుకోవాలని కోరుతోంది. మరోవైపు షిండే వర్గం మాత్రం.. శివసేన పార్టీ తమదే అని వాదిస్తోంది. 20మంది ఎమ్మెల్యేలు కూడా మద్దతివ్వని వ్యక్తిని కోర్టుల సాయంతో అధికారంలో కూర్చోబెట్టే దుస్థితిలో మనం ఉన్నామా అంటూ షిండే తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టులో కీలక వ్యాఖ్యలు చేశారు.
చదవండి: షిండే మంత్రివర్గంలో చోటుకు రూ.100 కోట్లు.. ఆ ఎమ్మెల్యేకు ఆఫర్‌!

మరిన్ని వార్తలు