సుప్రీంకు ‘సాగు చట్టాల’పై నివేదిక

1 Apr, 2021 06:09 IST|Sakshi

మార్చి 19న సీల్డ్‌ కవర్‌లో సమర్పించాం

సుప్రీంకోర్టు కమిటీ సభ్యుడు పి.కె.మిశ్రా

న్యూఢిల్లీ:  వివాదాస్పదంగా మారిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తన నివేదికను మార్చి 19వ తేదీన సీల్డ్‌ కవర్‌లో అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించింది. ఈ విషయాన్ని కమిటీలోని సభ్యుడు పి.కె.మిశ్రా బుధవారం బయటపెట్టారు. మూడు కొత్త సాగు చట్టాల అమలుపై జనవరి 11న సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ వీటిని అమలు చేయొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఈ చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు నలుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. చట్టాలను పూర్తిగా అధ్యయనం చేసి, భాగస్వామ్య పక్షాలతో చర్చించి, రెండు నెలల్లోగా నివేదిక సమర్పించాలని కమిటీకి సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. మార్చి 19న తమ నివేదికను సుప్రీంకోర్టుకు అందజేశామని పి.కె.మిశ్రా పేర్కొన్నారు. తదుపరి కార్యాచరణను న్యాయస్థానమే నిర్దేశిస్తుందని చెప్పారు. సుప్రీంకోర్టు కమిటీ రైతు సంఘాలు, నిపుణులు, వ్యాపార, వాణిజ్య సంఘాలు, మార్కెటింగ్‌ బోర్డులు తదితర భాగస్వామ్య పక్షాలతో 12 దఫాలు చర్చలు జరిపి, పలుమార్లు అంతర్గతంగా సమావేశమై నివేదికను రూపొందించింది.

రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు: గోయెల్‌
అన్నదాతల ప్రయోజనాలను కాపాడడం కోసమే మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చినట్లు కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ బుధవారం తేల్చిచెప్పారు. ఈ విషయంలో కొందరు వ్యక్తులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. కొత్త చట్టాల గురించి రైతులు అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. వీటివల్ల మండీ వ్యవస్థకు ఎలాంటి నష్టం ఉండదన్న సంగతి రైతులకు తెలిసిందన్నారు.

పార్లమెంట్‌ దాకా పాదయాత్ర
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనను మున్ముందు మరింత ఉధృతం చేయాలని రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్‌ మోర్చా నిర్ణయించింది. ఇందులో భాగంగా వచ్చే రెండు నెలల్లో చేపట్టాల్సిన కార్యాచరణను దాదాపు ఖరారు చేసినట్లు మోర్చా నేతలు బుధవారం తెలియజేశారు. మే నెలలో పార్లమెంట్‌ వరకు పాదయాత్ర చేయనున్నట్లు వెల్లడించారు. పాదయాత్ర తేదీని ఇంకా నిర్ణయించలేదని పేర్కొన్నారు. ఈ యాత్రలో రైతులతోపాటు మహిళలు, నిరుద్యోగులు, కార్మికులు సైతం పాల్గొంటారని, వారంతా తమ పోరాటానికి మద్దతిస్తున్నారని రైతు సంఘం నాయకుడు గుర్నామ్‌సింగ్‌ చాదునీ చెప్పారు. పార్లమెంట్‌ వరకూ శాంతియుతంగా పాదయాత్ర నిర్వహిస్తామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. ‘జనవరి 26’ తరహా ఘటనలు పునరావృతం కానివ్వబోమన్నారు.

మరిన్ని వార్తలు