Lakhimpur Kheri Violence: సమగ్ర నివేదిక అందించాలి: సుప్రీంకోర్టు

7 Oct, 2021 14:08 IST|Sakshi

న్యూడిల్లీ: దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన లఖీమ్‌పూర్‌ హింసాత్మక ఘటనపై సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. కేసు విచారణ సందర్భంగా కమిషన్‌ వేశామని యూపీ ప్రభుత్వం కోర్టుకు తెలపడంతో శుక్రవారంలోగా ఈ ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. కాగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి కాన్వాయ్‌లోని కారు దూసుకెళ్లిన విషయం తెలిసిందే  ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
చదవండి: Lakhimpur Kheri Violence: లఖీమ్‌పూర్‌ ఘటన: యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. ఇక ఉత్తరప్రదేశ్‌​ ప్రభుత్వం లఖీమ్‌పూర్‌ ఘటనను విచారించడానికి రిటైర్డ్‌ జడ్జీ ప్రదీప్‌ కుమార్‌ శ్రీవాస్తవతో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఈ కమిషన్ తన విచారణను రెండు నెలల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. 
చదవండి: ‘రైతులను నాశనం చేసినవాళ్లు .. రాజకీయంగా ఎదిగినట్లు చరిత్రలేదు’

మరోవైపు లఖింపుర్ ఖేరి ఘటన మృతుల కుటుంబాలకు గురువారం ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం పరిహారం అందించింది. ఒక్కో కుటుంబానికి రూ. 45 లక్షల విలువైన చెక్కును అందించింది. అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఇప్పటికే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా  సోమవారం కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్‌పై హత్య కేసు నమోదు చేశారు. కానీ ఇప్పటి వరకు అతన్ని అరెస్టు చేయలేదు. మరోవైపు లఖీంపూర్ ఖేరీ ఘటనకు కారణమైన కారు తనదేనని కేంద్ర సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా అన్నారు. అయితే ఆ సమయంలో తన కుమారుడు ఆశిష్ మిశ్రా కారులో లేడని చెప్పారు.

మరిన్ని వార్తలు