రిజర్వేషన్లను ఇంకెన్ని తరాలు కొనసాగిస్తారు: సుప్రీం కోర్టు

20 Mar, 2021 15:29 IST|Sakshi

న్యూఢిల్లీ: రిజర్వేషన్‌లకు సంబంధించి సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంకా ఎన్ని తరాల పాటు రిజర్వేషన్లను కొనసాగిస్తారని ప్రశ్నించింది. మరాఠా రిజర్వేషన్‌ కేసు విచారణ సందర్భంగా శుక్రవారం సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగాలు, విద్యకు సంబంధించి ఇంకా ఎన్ని తరాల పాటు రిజర్వేషన్లు కొనసాగుతాయో తెలుసుకోవాలని భావిస్తున్నట్లు కోర్టు తెలిపింది. అంతేకాక రిజర్వేషన్లలో ప్రస్తుతం అమలు చేస్తోన్న 50 శాతం పరిమితిని తొలగించాల్సి వస్తే  తలెత్తే అసమానతలపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ఈ ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ రిజర్వేషన్లపై పరిమితి విధించిన ‘మండల్‌ తీర్పు’ 1931 జనాభా లెక్కల ప్రకారం ఉన్నందున మారిన పరిస్థితుల దృష్ట్యా పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు.

అంతేగాక రిజర్వేషన్ కోటాలను పరిష్కరించడానికి కోర్టులు ఆయా రాష్ట్రాలకు వదిలివేయాలని వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం మీరు చెబుతున్నట్లు 50 శాతం కోటా పరిమితిని తొలగిస్తే ఆ తరువాత తలెత్తే అసమానతల పరిస్థితేంటి? అంతిమంగా మేం ఏం తేల్చాల్సి ఉంది. ఈ అంశంపై మీ వైఖరేంటి? ఇంకా ఎన్ని తరాలపాటు దీన్ని కొనసాగిస్తారు’ అని ధర్మాసనం ప్రశ్నించింది.‘‘స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచాయి. రాష్ట్ర ప్రభ్వుతాలు ఎన్నో పథకాలను అమలుచేస్తున్నాయి అయినా. వెనుకబడిన సామాజిక వర్గంలో ఏ మాత్రం అభివృద్ధి లేదన్న విషయాన్ని మనం అంగీకరించగలమా’ అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

అభివృద్ధి అనుకున్నంత స్థాయిలో జరగలేదు
అభివృద్ధి జరిగింది  కానీ, వెనుకబడి తరగతులు 50 శాతం నుంచి 20 శాతానికి తగ్గిపోలేదు. ఈ దేశంలో ఇప్పటికీ ఆకలి చావులు కొనసాగుతున్నాయి.. ఇందిరా సాహ్నీ తీర్పు పూర్తిగా తప్పని, దానిని చెత్తబుట్టలో వేయాలని అనడం లేదు.. ఈ తీర్పు వచ్చి 30 ఏళ్లు దాటింది.. చట్టాలు పూర్తిగా మారాయి, జనాభా పెరగడంతో సమాజంలో వెనుబడిన వర్గాలు సంఖ్య  పెరుగుతోంది. మండల్‌ తీర్పును పునఃసమీక్షించడానికి అనేక కారణాలు ఉన్నాయి’ అని ముకుల్ రోహత్గీ తన వాదనలు వినిపించారు. 

మరాఠా కోటా అంశానికి వస్తే మహారాష్ట్రలోని ఎంపీలు, ఎమ్మెల్యేల్లో ఆ వర్గం వారే 40శాతం వరకు ఉంటారన్నారు. రాష్ట్రంలోని అధిక శాతం భూములు వారి ఆధీనంలోనే ఉన్నాయన్నారు. ఈ కేసులో వాదనలు ఇంకా కొనసాగుతున్ననేపథ్యంలో  సోమవారానికి వాయిదా వేశారు. మహారాష్ట్ర రాష్ట్రంలో ప్రవేశాలు ప్రభుత్వ ఉద్యోగాలలో మరాఠాలకు కోటా మంజూరు చేయడాన్ని సమర్థించిన బాంబే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వేసిన పిటీషన్‌ను  ఉన్నత న్యాయస్థానం స్వీకరించిన విషయం తెలిసిందే.
(చదవండి : మరాఠాలు వెనుకబడిన వర్గం కాదు )

మరిన్ని వార్తలు