మెయింటెనెన్స్‌ కేసు.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

13 Oct, 2020 11:08 IST|Sakshi

న్యూఢిల్లీ: తల్లిదండ్రులకు పిల్లలే ప్రపంచం.. వారి కోసం ఏమైనా చేస్తారు. తిని తినక చాలీ చాలని బతుకులు బతుకుతూ పిల్లల్ని మాత్రం బాగా చూసుకుంటారు. బిడ్డలు వారి కాళ్ల మీద వారు నిలబడే వరకు తల్లిదండ్రులకు బెంగే. ఉద్యోగం, పెళ్లి చేసుకుని వారు జీవితంలో స్థిరపడితే అప్పుడు తల్లిదండ్రులు కాస్త స్థిమితపడతారు. ఇక మలిదశలో పిల్లలు, మనవలతో కాలక్షేపం చేయాలనుకుంటారు. అదిగో అక్కడ వస్తుంది సమస్య. ఇన్నాళ్లు తమ కోసం రక్తం చిందించిన కన్నవారికి నాలుగు ముద్దలు పెట్టడానికి కొద్ది మందికి మనసు రాదు. వారిని చూసుకుంటే ఆస్తులు కరిగిపోతాయన్నంత బాధ. ఎలాగైనా వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దాంతో ఒకప్పుడు నలుగురికి చేయూతనిచ్చిన వారు.. మలి దశలో మనసు చంపుకుని ఒకరి ముందు చేయి చాచే పరిస్థితిలో దీనంగా కాలం వెళ్లదీస్తుంటారు. వారి కోసం కోర్టులు చట్టలు ఉన్నాయని తెలిసినా బిడ్డల మీద ప్రేమతో ఫిర్యాదు చేయరు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ముందుకు ఓ కేసు వచ్చింది. దాని విచారణ సందర్భంగా కోర్టు తల్లిదండ్రులను పట్టించుకోని వారందరికి వర్తించేలా కీలక వ్యాఖ్యలు చేసింది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూడటం అంటే మీరు వారికేదో మేలు చేస్తున్నట్లు కాదు.. అసలు ఈ రోజు మీరు అనుభవిస్తున్న జీవితం వారు పెట్టిన భిక్ష అంటూ చివాట్లు పెట్టింది.

వివరాలు.. మలి సంధ్యలో కుమారులు తనను పట్టించుకోవడం మానేశారు.. ప్రతి నెల మెయిన్‌టెనెన్స్‌ కింద ఇచ్చే డబ్బులు కూడా ఆపేశారు. నాకు న్యాయం చేయండి అంటూ ఓ తండ్రి సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు విచారణ సోమవారం జరిగింది. జస్టిస్‌ ఎ.ఎమ్‌ ఖాన్విల్కర్‌ నేతృత్వంలోని ధర్మాసనం దీన్ని విచారించింది. ఈ క్రమంలో ‘మీరు ఆయనకు ఎలాంటి సహాయం చేయటం లేదు. అతను మీ తండ్రి. మీరిద్దరూ ఎంఎన్‌సీలలో పనిచేస్తున్నారని మాకు తెలిసింది. అయితే అందుకు కారణం మీ తండ్రి అనే విషయం మర్చిపోకండి’ అంటూ పిటిషన్‌ దారుడి కుమారుల మీద కోర్టు విరుచుకుపడింది. అంతేకాక కొడుకులిద్దరు పూర్వీకుల ఇంటి మీద వస్తోన్న అద్దెను తీసుకోవడమే కాక తండ్రిని ఇంటి నుంచి బయటకు గెంటాశరని తెలిసి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ తండ్రి వల్లనే మీకు ఈ ఆస్తి వచ్చింది. అలాంటిది ఆయన ఖర్చులకు డబ్బులు ఇవ్వకుండా మీరు ఎలా ఎంజాయ్‌‌ చేస్తున్నారని కోర్టు వారిని ప్రశ్నించింది. (చదవండి: అరెస్ట్‌ చేయకపోవడం సీరియస్‌ విషయం!)

ఢిల్లీలోని ఒక కుటుంబానికి సంబంధించిన కేసు. ఇద్దరు కుమారులు తమ భార్య, పిల్లలతో కలిసి కరోల్ బాగ్ ప్రాంతంలోని పూర్వీకుల ఇంట్లో నివసిస్తూ.. తండ్రిని బయటకు గెంటేశారు. దాంతో ఆయన తొలుత మెయింటెనెన్స్ ట్రిబ్యునల్‌ని ఆశ్రయించాడు. ఈ క్రమంలో గత సంవత్సరం కుమారులు తండ్రి జీవనాధారానికి 7,000 రూపాయలు చెల్లించాలని ట్రిబ్యునల్‌ తెలిపింది. కాని కుమారులు ఈ ఉత్తర్వుకు వ్యతిరేకంగా అప్పీల్ చేశారు. తల్లిదండ్రుల నిర్వహణ, సంక్షేమం, సీనియర్ సిటిజన్స్ చట్టం, 2007 లోని కొన్ని నిబంధనల ప్రామాణికతను వారు సవాలు చేశారు. వారి పిటిషన్‌ను పరిశీలించడానికి హైకోర్టు అంగీకరించింది, ట్రిబ్యునల్ ఉత్తర్వులను కూడా నిలిపివేసింది. దాంతో తండ్రి సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో సోమవారం ఈ పిటిషన్‌ విచారణకు వచ్చింది. ఈ క్రమంలో ధర్మాసనం కొడుకులు తమ తండ్రి బాగా జీవించేలా మంచి ఏర్పాట్లు చేయాలని కోరింది. నెలకు 7,000 రూపాయలు సరిపోవు అని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. మంచి మొత్తంతో రావాలని సూచించింది. సోమవారం, కుమారుల తరఫు న్యాయవాది తండ్రికి ప్రతి నెలా 10,000 రూపాయలు చెల్లిస్తారని కోర్టుకు తెలిపాడు. ఈ క్రమంలో కొడుకులిద్దరు పూర్వీకుల ఇంటిని ఆక్రమించడమే కాక దాని నుంచి వస్తోన్న అద్దెను కూడా వారే వాడుకుంటున్నారని తెలిసి బెంచ్ బాధపడింది. (చదవండి: గల్ఫ్‌దేశాలకు ఆదేశాలు ఎలా ఇస్తాం? )

జస్టిస్ ఖాన్విల్కర్ ఈ పూర్వీకుల ఆస్తి ప్రయోజనాలను తండ్రి కోల్పోలేడని అభిప్రాయపడ్డారు. "మీరు ఆ ఇంటిని మీ స్వంతంగా అమ్మేందుకు సిద్ధంగా ఉన్నారా లేదా మాకు చెప్పండి. మీరు ఇంటిని అమ్మలేకపోతే.. కోర్టు కమిషన్‌ని ఏర్పాటు చేసి ఇంటిని అమ్మి డబ్బును ముగ్గురికి సమానంగా పంచుతుంది" అని కోర్టు కొడుకుల తరఫు న్యాయవాదికి తెలిపింది. అంతేకాక వారం లోపు దీనికి సమాధానం చెప్పాలని ఆదేశించింది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు