16 మందికి న్యాయమూర్తులుగా పదోన్నతి!

1 Oct, 2021 05:37 IST|Sakshi

నాలుగు హైకోర్టుల్లో జడ్జీలుగా నియమించండి 

కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులు

న్యూఢిల్లీ: దేశంలో నాలుగు హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి గాను సుప్రీంకోర్టు కొలీజియం 16 పేర్లను సూచించింది. బాంబే, గుజరాత్, ఒడిశా, పంజాబ్‌–హరియాణాల హైకోర్టుల కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం సమావేశమై 16 మంది పేర్లను సూచించింది. వీరిలో ఆరుగురు జ్యుడీషియల్‌ ఆఫీసర్లు కాగా, మరో 10 మంది అడ్వొకేట్లు ఉన్నారు.

వీరికి పదోన్నతి కల్పించి, హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం పేర్కొంది. ఈ మేరకు గురువారం ఆ జాబితాను తన అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. నలుగురు జ్యుడీషియల్‌ అధికారులు ఎల్‌.పన్సారే, ఎస్‌.సి.మోరె, యూ.ఎస్‌.జోషి ఫాల్కే , బి.పి.దేశ్‌పాండేలను బాంబే హైకోర్టులో న్యాయమూర్తులుగా నియమించాలని ప్రతిపాదించింది. అడ్వొకేట్లు ఆదిత్యకుమార్‌ మహాపాత్రా, మృగాంక శేఖర్‌ సాహూ, జ్యుడీషియల్‌ ఆఫీసర్లు రాధాకృష్ణ పట్నాయక్, శశికాంత్‌ మిశ్రాలకు ఒడిశా హైకోర్టు జడ్జీలుగా పదోన్నతి కల్పించాలని సిఫార్సు చేసింది. గుజరాత్‌ హైకోర్టుకు అడ్వొకేట్లు మౌన మనీష్‌ భట్, సమీర్‌ జె.దేవ్, హేమంత్‌ ఎం.పృచ్ఛక్, సందీప్‌ ఎన్‌.భట్, అనిరుద్ధ ప్రద్యుమ్న, నీరల్‌ రష్మీకాంత్‌ మెహతా, నిషా మహేంద్రభాయ్‌ ఠాగూర్‌ పేర్లను సూచించింది.

పంజాబ్‌–హరియాణా హైకోర్టుకు అడ్వొకేట్‌ సందీప్‌ మౌడ్గిల్‌ పేరును సూచించింది. ఈ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణతోపాటు జస్టిస్‌ యు.యు.లలిత్, ఎ.ఎం.ఖాన్వి ల్కర్‌లతో కూడిన కొలీజియం హైకోర్టుల్లో జడ్జీ పోస్టుల ఖాళీల భర్తీకి సత్వర చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకు 100 మంది పేర్లను సూచించారు. సుప్రీంకోర్టులో ఉన్న తొమ్మిది ఖాళీలను భర్తీ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 25 హైకోర్టుల్లో 1,080 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా, ఈ ఏడాది మే నాటికి 420 మంది మాత్రమే ఉన్నారు. దీంతో ఖాళీలని్నంటినీ యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయడానికి కొలీజియం కృషి చేస్తోంది. 

మరిన్ని వార్తలు