సుప్రీంలో ‘హైబ్రిడ్‌’ విచారణ

7 Mar, 2021 06:17 IST|Sakshi

విచారణలో ఒక పార్టీ ప్రత్యక్షంగా, మరో పార్టీ టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా

న్యూఢిల్లీ:  గతేడాది మార్చి నుంచి ఆన్‌లైన్‌ టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా వాదనలు వింటున్న సుప్రీంకోర్టు ఇకపై హైబ్రిడ్‌ విధానంలో వాదనలు విననుంది. ఈ హైబ్రిడ్‌ పద్ధతి ఇదే నెల 15 నుంచి అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి సాధారణ మార్గదర్శకాలను (ఎస్‌ఓపీ) సుప్రీంకోర్టు శనివారం విడుదల చేసింది. ‘ప్రయోగాత్మకంగా, పైలట్‌ ప్రాజెక్టు కింద హైబ్రిడ్‌ విచారణ జరుగుతుంది. వీటిలో తుది వాదనలు, సాధారణ వాదనలు.. మంగళ, బుధ, గురు వారాల్లో జరుగుతాయి. ఏ పద్ధతిలో విచారణ జరగాలన్న విషయాన్ని ధర్మాసనమే నిర్ణయిస్తుంది. ఇరు వైపు కక్షిదారుల్లో ఉన్న సంఖ్యను బట్టి, కోర్టు హాలు సైజును బట్టి ధర్మాసనం నిర్ణయం తీసుకుంటుంది’ అంటూ మార్గదర్శకాల్లో సుప్రీంకోర్టు పేర్కొంది. ఇక సోమ, శుక్రవారాల్లో కేవలం టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా మాత్రమే విచారణ జరుగుతుంది.

ఏమిటీ హైబ్రిడ్‌ పద్ధతి..
విచారణ సమయంలో ఇరు పార్టీలకు చెందిన వ్యక్తుల సంఖ్య కోవిడ్‌ నిబంధనల ప్రకారం, గది సైజును మించి ఎక్కువగా ఉంటే.. అప్పుడు ధర్మాసనం హైబ్రిడ్‌ పద్ధతిలో విచారణ జరుపుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రస్తుతం కోర్టు గదిలో కేవలం 20 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే ప్రత్యక్ష విచారణ జరిపేలా పార్టీల్లో ఒకరు ప్రత్యక్షంగా, మరొకరు టెలీ కాన్ఫరెన్స్‌లో ఉంటారు. ఇదే ‘హైబ్రిడ్‌ విధానం’ అని సుప్రీంకోర్టు తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇదంతా ధర్మాసనం తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది.  ఎక్కువ పార్టీలు ఉంటే అప్పుడు ఒక్కో పార్టీకి ఒక్క అడ్వొకేట్‌ మాత్రమే విచారణలో పాల్గొంటారని తెలిపింది.   

ఇతర నియమాలు కూడా..
హైబ్రిడ్‌ పద్ధతిలో కూడా కరోనా నిబంధనలు తప్పనిసరి. విచారణల్లో పాల్గొనే వారికి ప్రాక్సిమిటీ/లాంగ్‌టర్మ్‌ కార్డులను జారీ చేయనున్నారు. ఈ కార్డులు నిర్ణీత కాలవ్యవధి అనుమతి మాత్రమే కలిగి ఉంటాయి.  వాదనల్లో పాల్గొనే ఇరు పార్టీలు ఆన్‌లైన్‌ ద్వారా విచారణ జరిపేందుకు అంగీకరిస్తే ధర్మాసనం కూడా దాన్ని ఆన్‌లైన్‌ ద్వారానే నిర్వహిస్తుంది. విచారణకు కేవలం 10 నిమిషాల ముందు మాత్రమే పార్టీలను కోర్టు హాల్లోకి అనుమతిస్తారు. 

మరిన్ని వార్తలు