ఇటాలియన్‌ మెరైన్‌ కేసు: సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

7 Aug, 2020 16:59 IST|Sakshi

న్యూఢిల్లీ: కేరళకు చెందిన మత్స్యకారులను కాల్చి చంపిన 2012 నాటి ‘ఇటాలియన్‌ మెరైన్‌’ కేసులో సుప్రీం కోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. నాటి ఘటనకు సంబంధించిన బాధితులకు.. ఇటలీ నష్ట పరిహారం చెల్లిస్తేనే ఈ కేసు ముగుస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ‘ఇటలీ వారికి పరిహారం చెల్లించనివ్వండి. అప్పుడే ప్రాసిక్యూషన్‌ని ఉపసంహరించుకుంటాము’ అని ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ ఏ బాబ్డే స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఐక్యరాజ్యసమితి ట్రిబ్యూనల్‌ నిర్ణయం మేరకు కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా కేంద్రం, సుప్రీం కోర్టును కోరింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హాజరయ్యి వాదనలు వినిపించారు. (అసభ్యతను వ్యాప్తి చేస్తున్నారు: సుప్రీంకోర్టు)

నాటి ఘటనకు బాధ్యులైన అధికారలను విచారిస్తామని.. బాధిత కుటుంబాలకు గరిష్ట నష్ట పరిహారం అందజేస్తామని ఇటలీ ఒక లేఖలో హామీ ఇచ్చినట్లు తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు. అయితే కేంద్రం వాదనలను కోర్టు తోసిపుచ్చింది. మత్స్యకారుల కుటుంబాలకు ముందుగా నష్టపరిహారం చెల్లించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. బాధితుల బందువులతో పాటు వారికి అందజేసే చెక్కులను తీసుకుని కోర్టుకు హాజరు కావాలని తెలిపింది. అంతేకాక వారం రోజుల్లో బాధితుల కుటుంబాలను ఈ కేసులో చేర్చుతూ దరఖాస్తు చేయాలని కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కేసును ఉపసంహరించుకునే ముందు బాధిత కుటుంబాల వాదనలను వినాల్సిన అవసరం ఉదని కోర్టు స్పష్టం చేసింది. (గతేడాది ఆత్మహత్య.. రూ.100 కోట్లు ఇప్పించండి)

ఈ కేసును విచారించిన అంతర్జాతీయ ట్రిబ్యునల్‌ భారత్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇటలీ మిలిటరీ చర్యలు భారత పౌరుల హక్కుకు భంగం కలిగించి, నిబంధనలు ఉల్లంఘించాయన్న ట్రిబ్యునల్.. ఈ కేసులో భారత్‌ వాదనను సమర్థించింది. ఈ నేపథ్యంలో ప్రాణ నష్టానికి బదులుగా పరిహారం పొందేందుకు భారత్‌ అర్హత సాధించిందని తెలిపింది. బాధిత కుటుంబాలకు ఇటలీ నష్ట పరిహారం చెల్లించాలని సూచించింది.

మరిన్ని వార్తలు