జూలై 31లోగా తుది ఫలితాలు ప్రకటించండి

25 Jun, 2021 06:18 IST|Sakshi

ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌.. మీ ఇష్టం

12వ తరగతి బోర్డులకు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచన

న్యూఢిల్లీ: 12వ తరగతి ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ ఫలితాలను జూలై 31వ తేదీలోగా ప్రకటించాలని రాష్ట్రాల బోర్డులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ విషయంలో అన్ని బోర్డులు ఒకే విధానాన్ని పాటించాల్సిన అవసరం లేదని, విద్యార్థుల ప్రతిభను అంచనా వేయడంలో సొంత నిర్ణయం తీసుకోవచ్చని, ఆ మేరకు బోర్డులకు స్వేచ్ఛ ఉందని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఏకరూప(యూనిఫామ్‌) విధానం ఉండాలంటూ తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోమని తేల్చిచెప్పింది. సొంత విధానాన్ని సాధ్యమైనంత త్వరగా రూపొందించుకోవాలని, గురువారం నుంచి 10 రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది.

కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ ఎ.ఎం.ఖన్వీల్కర్, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరిపింది. ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ ద్వారా 12వ తరగతి ఫలితాలను ప్రకటించాలని ఉద్ఘాటించింది. ఫలితాల ప్రకటనకు సీబీఎస్‌ఈ, సీఐఎస్‌సీఈ తరహాలో ఒక టైమ్‌లైన్‌ ఏర్పాటు చేసుకోవాలని, జూలై 31లోగా తుది ఫలితాలను వెల్లడించాలని రాష్ట్రాల బోర్డులకు ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌పై బోర్డులు స్వయంగా రూపొందించుకొనే విధానంలో తాము జోక్యం చేసుకోబోమంది. ప్రతి బోర్డుకు స్వయం ప్రతిపత్తి ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తుచేసింది. సొంత ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ విధానం ద్వారా ప్రకటించిన తుది ఫలితాలపై విద్యార్థుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు