పిండం ఎదుగుదల ఎలా ఉంది?

14 Oct, 2023 06:11 IST|Sakshi

వైద్య పరీక్షలు చేసి నివేదించాలని ఎయిమ్స్‌ మెడికల్‌ బోర్డుకి సుప్రీం ఆదేశాలు  

న్యూఢిల్లీ: వివాహిత 26 వారాల గర్భవిచ్చిత్తి కేసులో ఆమె గర్భంలో ఉన్న పిండం ఎదుగుదల ఎలా ఉందో నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు ఎయిమ్స్‌ వైద్యులను ఆదేశించింది. గత ఏడాది అక్టోబర్‌ నుంచి ఆ మహిళ ప్రసవానంతర మానసిక సమస్యలకు చికిత్స తీసుకుంటోందని గర్భాన్ని మోయడానికి ఆమె సిద్ధంగా లేదంటూ పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనల్ని çపరిగణనలోకి తీసుకుంది.

మానసిక సమస్యలకు ఆ మహిళ తీసుకుంటున్న మందులు ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువు ఆరోగ్యానికి ఏమైనా హాని చేస్తాయో పూర్తిగా పరీక్షలు చేసి వివరంగా కోర్టుకు నివేదించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్, జస్టిస్‌ జె.బి. పర్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

ఆ మహిళ శారీరక, మానసిక స్థితి ఎలా ఉందో పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. ‘‘ఇప్పటికే ఇద్దరు పిల్లల తల్లయిన ఆ మహిళ ప్రసవానంతరం వచ్చే మానసిక సమస్యలతో బాధపడుతోందని పరీక్షల్లో తేలితే ప్రత్యామ్నాయంగా మరేౖవైనా మందులు ఇవ్వొచ్చా పరిశీలించాలి’’ అని సుప్రీం బెంచ్‌ స్పష్టం చేసింది. ఎయిమ్స్‌ వైద్యులకి పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది.   

మరిన్ని వార్తలు