చట్ట సభల్లో సభ్యులైతే తప్పు చేస్తారా?

29 Jul, 2021 07:59 IST|Sakshi

కేరళ అసెంబ్లీ ఘటనపై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు 

న్యూఢిల్లీ: చట్టసభల సభ్యులకు ఉండే ప్రత్యేక హక్కులు, హోదాలు చట్టం నుంచి తప్పించుకునేందుకు ఉద్దేశించిన మార్గాలు కావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రతి పౌరుడి చర్యలను చట్టం నియంత్రిస్తుందని పేర్కొంది. 2015లో కేరళ అసెంబ్లీలో జరిగిన గొడవకు సంబంధమున్న 6గురు ఎల్‌డీఎఫ్‌ నేతలపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలన్న కేరళ ప్రభుత్వ విజ్ఞాపనను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది.

ప్రజా ఆస్తుల ధ్వంసరచనను చట్టసభలో వాక్‌స్వాతంత్రం, ప్రతిపక్ష సభ్యుల నిరసన హక్కులాంటివాటితో పోల్చలేమని, ఆరోజు బడ్జెట్‌కు వ్యతిరేకంగా నిరసన పేరుతో చట్టసభలో సభ్యులు ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడాన్ని చట్టసభ్యుల విధుల్లో భాగంగా చూడలేమని కఠిన వ్యాఖ్యల చేసింది. ఈ సభ్యుల ప్రవర్తన రాజ్యాంగం విధించిన హద్దులను దాటిందని, అందువల్ల వీరికి రాజ్యాంగం కల్పించే ప్రత్యేక హక్కుల కింద రక్షణ లభించదని జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని తేల్చిచెప్పింది. 2015లో కేరళ శాసనసభలో గొడవకు కారణమైన ఆరుగురు సభ్యులపై కేసును ఉపసంహరిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేరళ హైకోర్టు కొట్టివేయగా, దీనిపై ప్రభుత్వం సుప్రీంకు అప్పీలు చేసింది.

ఏం జరిగింది? 
2015 మార్చి 13న రాష్ట్ర అసెంబ్లీలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఎల్‌డీఎఫ్‌ సభ్యులు అప్పటి ఆర్థిక మంత్రి మణి బడ్జెట్‌ ప్రవేశపెట్టకుండా అడ్డుకునేందుకు యత్నించారు. ఈ సందర్భంగా వారు స్పీకర్‌స్థానాన్ని అగౌరవపరచడమే కాకుండా, సభలోని ఎలక్ట్రానిక్‌ పరికరాలను డ్యామేజి చేశారు. దీనివల్ల దాదాపు రూ. 2.2 లక్షల నష్టం వాటిల్లింది. వీరిపై ఐపీసీ 447 సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అనంతరం వచ్చిన ప్రభుత్వం వీరిపై కేసును ఉపసంహరించుకునే యత్నాలు ఆరంభించింది.

కానీ ప్రభుత్వ యత్నానికి కోర్టుల్లో ఎదురుదెబ్బ తగిలింది. అనంతరం ఈ అంశం సుప్రీంకోర్టు చెంతకు చేరింది. దీనిపై విచారణ జరుపుతూ, ఆందోళన పేరుతో ప్రజా ఆస్తుల ధ్వంసాన్ని సహించకూడదని కోర్టులు, పార్లమెంట్‌ భావిస్తున్నాయనితెలిపింది. చట్టసభ్యులకు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికిల్‌ 105, 194 అనేవి కేవలం చట్టసభ్యులు వారి విధులు సక్రమంగా నిర్వహించడం కోసం ఉద్దేశించినవని స్పష్టం చేసింది. ఈ విధుల్లో ఆందోళన పేరిట పబ్లిక్‌ ప్రాపర్టీని ధ్వంసం చేయడం రాదని తెలిపింది.  

మరిన్ని వార్తలు