జేఈఈ, నీట్‌ వాయిదాకు సుప్రీం నో!

18 Aug, 2020 02:22 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇంజినీరింగ్, వైద్య విద్య ప్రవేశ పరీక్షలు జేఈఈ, నీట్‌లు వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. విలువైన విద్యా సంవత్సరాన్ని వృథా కానివ్వలేమని, కరోనా వైరస్‌ ఉన్నప్పటికీ జీవితం ముందుకు సాగాల్సిందేనని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. (3 కోట్లు దాటిన పరీక్షలు)

ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం జేఈఈ పరీక్ష సెప్టెంబరు 1 –6 తేదీల్లో, నీట్‌ పరీక్ష అదే నెల 13వ తేదీన జరగాల్సి ఉంది. దేశంలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్న కారణంగా వీటిని వాయిదా వేయాలని 11 మంది విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పదకొండు రాష్ట్రాలకు చెందిన ఈ విద్యార్థులు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ పరీక్షల నిర్వహణకు సంబంధించి జూలై మూడున జారీ చేసిన నోటిఫికేషన్‌ను కొట్టివేయాలని తమ పిటిషన్‌లో కోరారు. అయితే ఈ అంశాలపై జస్టిస్‌ బి.ఆర్‌.గవాయి, జస్టిస్‌ కృష్ణ మురారిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.  

వీడియో కాన్ఫరెన్సింగ్‌ విచారణ సందర్భంగా జస్టిస్‌ అరుణ్‌మిశ్రా మాట్లాడుతూ విద్యార్థుల కెరీర్‌ను దీర్ఘకాలం డోలాయమానంలో ఉంచలేమని వ్యాఖ్యానించారు. దీంతో జేఈఈ, నీట్‌ పరీక్షలు సెప్టెంబరులోనే జరిగేందుకు మార్గం సుగమమైంది. విచారణ సందర్భంగా సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ సమయంలో అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు.

పిటిషనర్ల తరఫున న్యాయవాది అలోక్‌ శ్రీవాస్తవ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత మాత్రమే జేఈఈ, నీట్‌ పరీక్షలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలని, పరీక్షల వాయిదాతో తమకు సాంత్వన చేకూరుతుందని లక్షల మంది విద్యార్థులు సుప్రీంకోర్టువైపు చూస్తున్నారని అన్నారు.

పరీక్ష నిర్వహణ కేంద్రాల సంఖ్యను పెంచాలని కూడా ఆయన తన పిటిషన్‌లో కోరారు. ‘‘ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో జేఈఈ, నీట్‌ నిర్వహించడం పిటిషన్‌దారులతోపాటు లక్షలాది విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టడమే. మరికొంత కాలం వేచి చూడటం మేలైన పని. విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రాణాలు కాపాడేందుకు కోవిడ్‌ పరిస్థితులు చక్కబడిన తరువాతే పరీక్షలు నిర్వహించాలి’’అని ఆ పిటిషన్‌లో కోరారు.

జేఈఈ, నీట్‌ పరీక్షలు నిర్వహించే ఎన్‌టీఏ ఈ ఏడాది 161 కేంద్రాల్లో జేఈఈని ఆన్‌లైన్‌ పద్ధతిలోనూ, నీట్‌ను ఆఫ్‌లైన్‌లోనూ నిర్వహించాలని తీర్మానించిందని పిటిషన్‌దారులు పేర్కొన్నారు. కోవిడ్‌ నేపథ్యంలో ఎన్‌టీఏ జూన్‌ 22న జరగాల్సిన నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ జాయింట్‌ ఎంట్రన్స్‌ పరీక్షను వాయిదా వేసిందని పిటిషన్‌దారులు తెలిపారు.

బిహార్, అసోం, ఈశాన్య రాష్ట్రాల్లో వరదల కారణంగా విద్యార్థులు ఎదుర్కొనే కష్టాలను ఎన్‌టీఏ పరిగణనలోకి తీసుకోలేదని, ఈ రాష్ట్రాల విద్యార్థులు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ పరీక్షలకు హాజరయ్యే పరిస్థితుల్లో లేరని వివరించారు. ఇదిలా ఉండగా.. ఆయుష్‌ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ప్రవేశ పరీక్ష ఏఐఏపీజీఈటీని వాయిదా వేయాలని, కోవిడ్‌ కేసులు ఎక్కువ అవుతున్న తరుణంలో పరీక్ష నిర్వహణ సరికాదని పలువురు డాక్టర్లు సోమవారం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్‌ వేయడం కొసమెరుపు.   

మరిన్ని వార్తలు