ఇది సమంజసమేనా? 

28 Feb, 2023 03:42 IST|Sakshi

‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో సుప్రీంకోర్టు అసహనం 

బాధ్యతాయుత సీఎం హోదాలో ఉండి న్యాయమూర్తులకు వీడియో క్లిప్పింగులు పంపడం సబబేనా? 

ఇది న్యాయమూర్తుల ఆలోచనను మార్చడమే.. 

సిట్‌ అయితే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేయదా అని ప్రశ్న 

హోలీ సెలవుల తర్వాత పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని నిర్ణయం 

ఏ ధర్మాసనం విచారించేదీ చీఫ్‌ జస్టిస్‌ నిర్ణయం తీసుకుంటారని వెల్లడి 

సాక్షి, న్యూఢిల్లీ: ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఉండి న్యాయమూర్తులకు కేసుకు సంబంధించిన వీడియో క్లిప్పింగులు పంపిస్తారా? బాధ్యతాయుతమైన హోదాలో ఉండి అలా చేయడం సబబేనా?’’ అని ‘ఎమ్మెల్యేలకు ఎర’ వ్యవహారంలో సుప్రీంకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ తీరు అసౌకర్యంగా ఉందని, ఇది న్యాయమూర్తుల ఆలోచనను మార్చడమేనని అభిప్రాయం వ్యక్తం చేసింది.

‘ఎమ్మెల్యేలకు ఎర’కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్‌ను సోమవారం జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ అరవిందకుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. మొదట ఆయన వాదన ప్రారంభిస్తుండగానే ధర్మాసనం కల్పించుకుని.. ‘కోర్టు సమయం ముగిసే లోపు వాదనలు పూర్తవుతాయా?’అని ప్రశ్నించింది.

ప్రజాస్వామ్య మనుగడనే ప్రశ్నించేలా ఉన్న ఈ కేసు చాలా తీవ్రమైందని, వాదనలు వినాలని దవే కోరారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా సీబీఐకి కేసు విచారణను ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ‘‘సిట్‌ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి ఉండదా?’’అని ప్రశ్నించగా.. స్థానిక హైకోర్టు పర్యవేక్షణలో సిట్‌ దర్యాప్తు చేస్తుందని దవే వివరించారు.

అసలు ఈ కేసు దర్యాప్తులో సీఎం జోక్యం చేసుకున్నారన్న ప్రసక్తే సరికాదని, విలేకరుల సమావేశం నిర్వహిస్తే జోక్యం అనడం సరికాదని పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసులు నిత్యం టీవీల్లో ప్రసారం అవుతున్నాయని, ఆదివారం ఢిల్లీ డిప్యూటీ సీఎం విచారణపైనా ప్రసారాలు వచ్చాయని గుర్తు చేశారు.  

ఇది అసౌకర్యంగా ఉంది 
దవే వాదనల మధ్యలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ‘సీఎం న్యాయమూర్తులకు ఆడియో, వీడియో క్లిప్పింగులు పంపించడం సమంజసమేనా?’అని ప్రశ్నించింది. సీఎం వ్యవహరించిన తీరు న్యాయమూర్తుల ఆలోచనను మార్చడమేనని అభిప్రాయపడింది. అయితే దీనిపై సీఎంను సంప్రదించకుండానే తాను క్షమాపణలు చెప్తున్నానని, ఈ అంశాన్ని మరో కోణంలో చూడాల్సి ఉందని న్యాయవాది దవే ధర్మాసనాన్ని కోరారు. ఈ విధంగా కేసుకు సంబంధించిన క్లిప్పింగులు పంపడం అసౌకర్యంగా ఉందని జస్టిస్‌ బీఆర్‌ గవాయి పేర్కొనగా.. విచారణను మరో ధర్మాసనానికి బదిలీ చేయొచ్చని దవే సూచించారు. 

హోలీ సెలవుల తర్వాత విచారణ 
హోలీ సెలవుల తర్వాత ఈ పిటిషన్‌పై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ధర్మాసనం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం విచారిస్తున్న ఇద్దరు న్యాయమూర్తులం వేర్వేరు కాంబినేషన్ల ధర్మాసనాల్లో ఉంటున్నామని.. చీఫ్‌ జస్టిస్‌ నుంచి తగిన ఆదేశాలు తీసుకొని, తగిన బెంచ్‌ ముందు ఈ పిటిషన్‌ను లిస్ట్‌ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.  

సిట్‌ దర్యాప్తునకు అనుమతించండి 
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో ఐదు గంటల వీడియో, ఆడియో కాల్స్, వాట్సాప్‌ చాట్‌లతో కూడిన ఆధారాలు ఉన్నాయని ధర్మాసనానికి దవే వివరించారు. సిట్‌ వద్ద కీలక ఆధారాలు ఉన్నాయని, ఇప్పుడు సీబీఐ దర్యాప్తు అంటే ఎలాగని.. హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సిట్‌ దర్యాప్తునకు అనుమతించాలని కోరారు. ప్రతిపక్ష నేతలపై కేసులు నమోదు చేస్తున్న దర్యాప్తు సంస్థలు.. అధికార బీజేపీ నేతలపై ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు.

ప్రాంతీయ ప్రభుత్వాలను పడగొట్టాలని బీజేపీ చూస్తోందని, ఎమ్మెల్యేలను పార్టీ చేర్చుకునేందుకు డబ్బులతో ప్రలోభపెడుతోందని ఆరోపించారు. సీబీఐ దర్యాప్తు అనే సరికి ఈ కేసు ముందుకు సాగడం లేదని పేర్కొన్నారు. దవే వాదనలు కొనసాగిస్తుండగా జస్టిస్‌ బీఆర్‌ గవాయి జోక్యం చేసుకొంటూ.. కేసుకు సంబంధించిన ఆధారాలను ముఖ్యమంత్రికి ఇచ్చారా? అని ప్రశ్నించారు.

అక్టోబర్‌ 27న తాము కోర్టుకు ఆధారాలను సమర్పించామని, నవంబరు 3న పూర్తి సమాచారంతో కూడిన పెన్‌డ్రైవ్‌ను అందజేశామని దవే తెలిపారు. ‘‘సీఎం కొత్తగా ప్రెస్‌మీట్‌లో ఏమీ చెప్పలేదు. చట్టబద్ధమైన పాలనలో ఉన్నాం. కోర్టులు పూర్తిస్థాయి ఆధారాల కోసం చూడాలి. వాస్తవం కళ్లు మూసుకోరాదు. ఇది బీజేపీ లేదా బీఆర్‌ఎస్‌ గురించి కాదు. ప్రజాస్వామ్యం గురించి, వారిని అధికారంలోకి తెచ్చిన సామాన్యుల గురించి.. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ అవసరం’’ అని ధర్మాసనానికి దవే విన్నవించారు. కాగా.. ఈ కేసులో బీజేపీ తరఫున సీనియర్‌ న్యాయవాది మహేశ్‌ జెఠ్మలానీ హాజరయ్యారు.  

మరిన్ని వార్తలు