పీఎం కేర్స్‌ నిధుల మళ్లింపు అనవసరం 

19 Aug, 2020 03:22 IST|Sakshi

స్పష్టం చేసిన సుప్రీంకోర్టు 

ఎన్డీఆర్‌ఎఫ్‌కు మళ్లించాలనే పిల్‌ కొట్టివేత 

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 విపత్తును ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌ ఫండ్‌ నిధులను జాతీయ విపత్తు నిధి (ఎన్డీఆర్‌ఎఫ్‌)కి బదిలీ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ ఇంటరెస్ట్‌ లిటిగేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ఒక పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని బెంచ్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పీఎం కేర్స్‌ ఫండ్, ఎన్డీఆర్‌ఎఫ్‌లు పూర్తిగా భిన్నమైనవని, వేర్వేరు ఉద్దేశాలతో ఏర్పాటైనవని పేర్కొంది. కోవిడ్‌ విపత్తును ఎదుర్కొనడానికి ఎన్డీఆర్‌ఎఫ్‌ నిధులను కేంద్రం వాడుకోవడంపై ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపింది.

ఎన్డీఆర్‌ఎఫ్‌కు స్వచ్ఛందంగా ఎప్పుడైనా విరాళాలు ఇవ్వవచ్చునని, అలాగే కోవిడ్‌–19ను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళిక ఏదీ అవసరం లేదని, విపత్తు నిర్వహణ చట్టంలోని జాతీయ ప్రణాళిక సరిపోతోందని జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.రెడ్డి, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన బెంచ్‌ స్పష్టం చేసింది. కరోనా కట్టిడికి కేంద్ర ప్రభుత్వం... రాష్ట్రాలకు సహాయం చేస్తున్నపుడు... నిధులు ఎందులోనుంచి ఇవ్వాలనేది పిటిషనర్‌ చెప్పజాలడని పేర్కొంది. పీఎం కేర్స్‌ నిధిపై కాగ్‌ ఆడిట్‌ అవసరం లేదని స్పష్టం చేసింది. అలాగే కేంద్రం ఆర్థిక నిర్ణయాల్లో కోర్టు జోక్యం చేసుకోలేదని చెప్పింది. కేంద్రప్రభుత్వం మార్చి 28న ప్రైమ్‌ మినిస్టర్స్‌ సిటిజెన్‌ అసిస్టెన్స్‌ అండ్‌ రిలీఫ్‌ ఇన్‌ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌... క్లుప్తంగా పీఎంకేర్స్‌ పేరుతో ఒక నిధిని ఏర్పాటు చేసి కోవిడ్‌ వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకునేందుకు ఉపయోగించాలని తీర్మానించింది.

ప్రధాని ఎక్స్‌ అఫీషియో చైర్మన్‌గా వ్యవహరించే ఈ నిధి నిర్వహణకు రక్షణ, హోం, ఆర్థిక శాఖల మంత్రులను ఎక్స్‌అఫీషియో ట్రస్టీలుగా నియమించారు. అయితే విపత్తు సమయాల్లో ఆదుకునేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ ఒకటి ఇప్పటికే అందుబాటులో ఉన్న నేపథ్యంలో కొత్తగా పీఎంకేర్స్‌ ఏర్పాటు ఆవశ్యకతను సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ లిటిగేషన్‌ సంస్థ సుప్రీంకోర్టులో ప్రశ్నించింది. కేంద్రం జూలై 27న ఒక ప్రకటన చేస్తూ పీఎంకేర్స్‌ అనేది స్వచ్ఛంద విరాళాలపై పనిచేసే పబ్లిక్‌ ట్రస్ట్‌ అని, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ల బడ్జెట్‌ కేటాయింపుల్లోని నిధులను పీఎంకేర్స్‌ కోసం వాడటం లేదని స్పష్టం చేసింది. ఈ నిధి సమాచార హక్కు చట్టం కిందకు రాదని తెలిపింది. 

స్వచ్ఛంద నిధి: సుప్రీంకోర్టులో కేంద ప్రభుత్వం తరఫున సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌లకు బడ్జెట్‌ ద్వారా నిధులు సంక్రమిస్తాయని, పీఎంకేర్స్‌ స్వచ్ఛంద విరాళాల ఆధారంగా పనిచేస్తుందని తెలిపారు. అయితే ఈ రకమైన నిధి ఏర్పాటు విపత్తు నిర్వహణ చట్టానికి విరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాది దుష్యంత్‌ దవే వాదించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ పద్దులను కాగ్‌ ఆడిట్‌ చేస్తారని, పీఎంకేర్స్‌కు మాత్రం ప్రైవేట్‌ ఆడిటర్లు నిర్వహిస్తారని ప్రభుత్వం చెబుతోందని దుష్యంత్‌ దవే ఆరోపించారు. 

కుట్రలకు చెంపపెట్టు: బీజేపీ 
పీఎంకేర్స్‌ నిర్వహణపై సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్న వారికి చెంపపెట్టులాంటిదని బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పును స్వాగతించిన ఆయన రాహుల్‌గాంధీ, యాక్టివిస్టులకు ఈ తీర్పు పెద్ద దెబ్బ అని అన్నారు. రాహుల్‌ ‘వాగుడు’ను పీఎంకేర్స్‌ నిధికి భారీగా సాయమందించిన సామాన్య ప్రజలు పదేపదే తిరస్కరించారని, ఇకనైనా రాహుల్, అతడి అనుచరణ గణం పద్ధతులు మార్చుకోవాలన్నారు.

పారదర్శకతకు దెబ్బ: కాంగ్రెస్‌ 
పీఎం కేర్స్‌పై సుప్రీంకోర్టు తీర్పు పారదర్శకతకు, జవాబుదారీతనానికి గొడ్డలిపెట్టు లాంటిదని కాంగ్రెస్‌ అభివర్ణించింది. ప్రజాధనాన్ని స్వీకరిస్తూ ఎవరికీ జవాబుదారీ కాదనే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని..సరిదిద్దాల్సిన న్యాయస్థానం అది చేయలేదని కాంగ్రెస్‌  ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా అన్నారు. పీఎం కేర్స్‌పై సమాధానాలు రాబట్టే అవకాశాన్ని కోర్టు జారవిడుచుకుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు