Mohammed Zubair: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జుబేర్‌కు బెయిల్‌ మంజూరు

8 Jul, 2022 14:33 IST|Sakshi

న్యూఢిల్లీ: మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టిన ఆరోపణలపై ఫ్యాక్ట్‌చెక్‌ వెబ్‌సైట్‌ ‘ఆల్ట్‌ న్యూస్‌’ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్టు మహ్మద్‌ జుబేర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌చేసిన విషయం తెలిసిందే. కాగా, మ‌హ్మాద్ జుబేర్‌కు ప్రాణ హాని ఉంద‌ని, ఆయ‌న‌కు ప‌లువురి నుంచి బెదిరింపులు వ‌స్తున్నాయ‌ని భ‌ద్ర‌త‌పై ఆందోళ‌న చెందుతున్నామ‌ని జుబేర్ న్యాయ‌వాది సీనియ‌ర్ అడ్వ‌కేట్ కొలిన్ గొన్‌సేల్వ్స్ సుప్రీంకోర్టుకు గురువారం విన్నవించారు.

ఈ నేపథ్యంలో బెయిల్‌ అంశంపై శుక‍్రవారం విచారణ చేపట్టన ధర్మాసనం.. జుబేర్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. యూపీ కేసులో జుబేర్ బెయిల్ పిటిష‌న్‌ను సీతాపూర్ కోర్టు తిర‌స్క‌రించ‌డంతో ఆయ‌న సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఈ కేసులో జ‌స్టిస్ ఇందిరా బెన‌ర్జీ యూపీ ప్ర‌భుత్వం, యూపీ పోలీసుల‌కు నోటీసులు జారీ చేస్తూ జుబేర్‌కు ష‌ర‌తుల‌తో కూడిన మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేసిన‌ట్టు తెలిపారు. జుబేర్ ఎలాంటి ట్వీట్‌లు చేయ‌రాద‌ని, ఆధారాలు తారుమారు చేయ‌రాద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది.

విచారణ సందర్భంగా యూపీ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. సోషల్‌ మీడియా వేదికగా జుబేర్‌ మతపరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని తెలిపారు. జూన్ 1న న‌మోదైన ఎఫ్ఐఆర్‌కు సంబంధించే మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరైంద‌ని చెప్పారు. విచార‌ణ‌ను నిలిపివేయ‌డం, ఈ అంశంలో ఎలాంటి జోక్యం చేసుకోవడం లేద‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్ధానం తేల్చిచెప్పింది. మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌ను సోమ‌వారం వ‌ర‌కూ నిలిపివేయాల‌ని యూపీ పోలీసుల త‌ర‌పున వాద‌న‌లు వినిపించిన సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా అభ్య‌ర్ధ‌న‌ను కోర్టు తోసిపుచ్చింది.

ఇక, నాలుగేళ్ల కిందట ఆయన షేర్‌ చేసిన ఓ ట్వీట్‌ పట్ల తీవ్రఅభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ ట్వీట్‌ మతపరమైన సెంటిమెంట్లను దెబ్బతీసేదిగా ఉందని, విద్వేషాలను రగిల్చేదిగా ఉందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. దీంతో ఢిల్లీ పోలీసులు.. జుబేర్‌ను అరెస్ట్‌ చేశారు. అనంతరం యూపీలోని సీతాపూర్‌ కోర్టులో హాజరుపరుచగా.. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.

మరిన్ని వార్తలు