Indrani Mukerjea: షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్‌

18 May, 2022 13:57 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, కన్న కుమార్తెనే హత్య చేసిందని ఆరోపణ లెదుర్కొంటున్న ఇంద్రాణి ముఖర్జీకి సుప్రీంకోర్టు బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది. ఆరున్నరేళ్లు జైల్లో గడపడం అంటే చాలా సుదీర్ఘ కాలమని వ్యాఖ్యానించింది. ఇప్పట్లో విచారణ పూర్తయ్యే అవకాశం లేనందున ఆమెకు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించి 237 సాక్షుల్లో ఇప్పటివరకు ప్రాసిక్యూషన్‌ 68 మందిని మాత్రమే విచారించింది.

మరో పదేళ్లయినా ఈ కేసు విచారణ పూర్తయ్యే అవకాశం లేదని, బెయిల్‌ ఇవ్వాలంటూ ఇంద్రాణి తరఫున వాదిస్తున్న సీనియర్‌ లాయర్‌ ముకుల్‌ రొహ్తగి పేర్కొన్నారు. జస్టిస్‌ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్‌ ఇప్పట్లో ఈ కేసు విచారణ పూర్తయ్యేలా లేనందున బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. ‘‘ఈ కేసులో ఆరున్నరేళ్లుగా ఇంద్రాణి జైల్లోనే ఉన్నారు. ఇప్పటివరకు 50 శాతం మంది సాక్షుల విచారణ కూడా పూర్తి కాలేదు. చాలాకాలం గా జైల్లో ఉన్నందున బెయిల్‌ ఇస్తున్నాం’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.  

ఏమిటీ కేసు...? 
ఇంద్రాణి ముఖర్జీకి ఆమె మొదటి భర్తతో పుట్టిన కుమార్తె షీనా బోరా. 2012లో ఆమె హత్య జరిగితే మూడేళ్ల వరకు ఆ విషయమే బయటకు రాలేదు. ఇంద్రాణి తన మొదటి భర్తతో విడిపోయాక సంజీవ్‌ ఖన్నా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత అతనికి విడాకులిచ్చి ప్రముఖ మీడియా ఎగ్జిక్యూటివ్‌ పీటర్‌ ముఖర్జీని పెళ్లి చేసుకుంది. షీనా తన కుమార్తె అని కాకుండా తన చెల్లి అనే అందరికీ పరిచయం చేసింది. ఆమె కనిపించకపోతే అమెరికా వెళ్లిపోయిందని ఇంద్రాణి అందరినీ నమ్మబలు కుతూ వచ్చింది.

అయితే మరో కేసులో ఇంద్రాణి డ్రైవర్‌ను అరెస్ట్‌ చేసి విచారిస్తుండగా తల్లే కుమార్తెను చంపిన విషయం తేలింది.  కారులో ప్రయాణిస్తుండగా షీనా బోరాకు ఊపిరాడ నివ్వకుండా చేసి తల్లి ఇంద్రాణియే చంపితే, ఆమెకు భర్త పీటర్‌ ముఖర్జీ, డ్రైవర్‌ శ్యామ్‌వర్‌ రాయ్‌ సహకరించినట్టుగా తేలింది.  దీంతో ఇంద్రాణిని, ఆమె భర్త పీటర్‌ని 2015లో అరెస్ట్‌ చేశారు.  ఇంద్రాణి భర్త పీటర్‌ ముఖర్జీకి మొదటి భార్య సంతానమైన రాహుల్‌ ముఖర్జీతో షీనా ప్రేమలో పడింది. వారిద్దరి మధ్య అఫైర్‌ని ఉందని తెలిసి తట్టుకోలేక ఇంద్రాణి కన్నకూతురని చూడకుండా పథకం ప్రకారం హత్య చేసిందని విచారణలో తేలింది. మరోవైపు జైల్లో ఉండగానే పీటర్, ఇంద్రాణిలు విడాకులు తీసుకున్నారు. 2019లో వారికి విడాకులు మంజూరయ్యాయి. 
చదవండి: గుజరాత్‌ కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. హార్దిక్‌ పటేల్‌ రాజీనామా

మరిన్ని వార్తలు