జర్నలిస్టు సిద్దిఖికి బెయిల్‌

10 Sep, 2022 06:37 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ జైల్లో రెండేళ్లుగా మగ్గిపోతున్న కేరళ జర్నలిస్టు సిద్దిఖి కప్పన్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ప్రతీవ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందన్న అత్యున్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్‌ హథ్రాస్‌లో 2020 సెప్టెంబర్‌లో 19 ఏళ్ల దళిత యువతి సామూహిక అత్యాచారానికి గురై మరణించిన దుర్ఘటనని కవర్‌ చేయడానికి వెళుతున్న సిద్దిఖిని యూపీ పోలీసులు అడ్డుకొని అరెస్ట్‌ చేశారు.

ఉగ్రవాద సంస్థలకు ఆయన నిధులు అందిస్తారన్న ఆరోపణలపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిషేధ చట్టం (యూఏపీఏ) కింద అదుపులోనికి తీసుకున్నారు. మూడు రోజుల్లోగా కప్పన్‌ను ట్రయల్‌ కోర్టులో హాజరు పరిచి ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ ఆధ్వర్యంలోని సుప్రీం బెంచ్‌ ఆదేశాలు జారీ చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆరువారాలు కప్పన్‌ ఢిల్లీలోనే ఉండాలని, ప్రతీ సోమవారం పోలీసు స్టేషన్‌ కావాలని షరతులు విధించింది.

ఆ తర్వాత కేరళలో తన సొంత గ్రామానికి వెళ్లవచ్చునని సుప్రీం బెంచ్‌ స్పష్టం చేసింది. 2020 సెప్టెంబర్‌ 14న హథ్రాస్‌లో ఒక దళిత యువతిపై అదే గ్రామానికి చెందిన నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. బాధితురాలి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చిన పోలీసులు అర్థరాత్రి హడావుడిగా అంతిమ సంస్కారాలు నిర్వహించడంతో అనుమానాలు రేకెత్తి నిరసనలు భగ్గుమన్నాయి. సంచలనం సృష్టించిన ఈ ఉదంతాన్ని కవర్‌ చేయడానికి యూపీ వెళుతుండగా మార్గమధ్యలోనే కప్పన్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే పాపులర్‌ ఫ్రంట్‌ ఇండియాతో సంబంధాలున్నాయని వాదిస్తూ వచ్చారు.

మరిన్ని వార్తలు