నౌహీరా షేక్‌కు బెయిల్‌ మంజూరు

20 Jan, 2021 08:24 IST|Sakshi

షరతులతో అనుమతించిన సుప్రీంకోర్టు

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ప్రజాకర్షక పథకాల పేరుతో వేల కోట్ల రూపాయలు అక్రమంగా సేకరించిన కేసులో హీరా గోల్డ్‌ గ్రూప్‌ అధినేత నౌహీరా షేక్‌కు బెయిల్‌ మంజూరైంది. డిపాజిటర్లకు సొమ్ము తిరిగి చెల్లించడానికి ఆరువారాల గడువుతోపాటు వ్యక్తిగత బాండుపై షరతులు విధిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. బెయిల్‌ పిటిషన్‌ను మంగళవారం జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ‘‘ఇరుపక్షాల వాదనలూ విన్నాం. డిపాజిటర్ల డబ్బు కోల్పోకుండా కోర్టు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే మధ్యంతర బెయిలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. పెట్టుబడిదారులకు డిపాజిట్లు చిత్తశుద్ధితో తిరిగి చెల్లిస్తానని చెప్పడంతో ఓ అవకాశం ఇస్తున్నాం. వ్యక్తిగత బాండుపై షరతులతో కూడిన ఆరువారాల మధ్యంతర బెయిలు మంజూరు చేస్తున్నాం. సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ దర్యాప్తు అధికారి వద్ద సొమ్ము జమ చేయాలి’’ అని కోర్టు సూచించింది.

‘‘నౌహీరా షేక్‌ తన స్నేహితుడి ద్వారా ఇచ్చిన ఒప్పందానికి కట్టుబడి ఉంటారని, ఫిర్యాదుదారుల క్లెయిమ్‌లు గడువు తేదీ నాటికి పరిష్కరిస్తారని ఈ బెయిలు ఇస్తున్నాం. చెల్లింపులు సులభంగా చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అటాచ్‌చేసిన రూ.21 కోట్లు, ఈడీ అటాచ్‌ చేసిన రూ.22 కోట్లతోపాటు నౌహీరా జమ చేసిన రూ.6 కోట్లు మొత్తం సుమారు రూ.50 కోట్లు వినియోగించుకోవచ్చు. వాటిని వినియోగించడానికి అటాచ్‌ చేసిన బ్యాంకు ఖాతాలు సంబంధిత దర్యాప్తు అధికారి సంతకం ద్వారా ఆపరేషన్‌లోకి వస్తాయి. ప్రతి సోమవారం పది గంటలకు కూకట్‌పల్లి పోలీసు స్టేషన్‌లో రిపోర్టు చేయాలి. ఎఫ్‌ఐఆర్‌ నమోదైన పోలీసు స్టేషన్‌ లేదా ఫిర్యాదు పెండింగ్‌లో ఉన్న కోర్టు/పోలీసు స్టేషన్‌ ద్వారా ఈ మొత్తాలు చెల్లించాలి’’అని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. 

మరిన్ని వార్తలు