13 మందికి సుప్రీం బెయిల్‌

9 Jul, 2021 06:10 IST|Sakshi

బాల నేరస్తులుగా శిక్షా కాలం ముగిసినా జైలు జీవితం

సాక్షి, న్యూఢిల్లీ: బాల నేరస్తులుగా శిక్షా కాలం ముగిసినా సాధారణ జైళ్లలో ఉన్న 13 మందికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఖైదీల వయసు దరఖాస్తులను పరిష్కరించాలని అలహాబాద్‌ కోర్టులో న్యాయవాది రిషి మల్హోత్రా 2012లో పిటిషన్‌ దాఖలు చేశారు. దానికి అనుగుణంగా 13 మంది పిటిషనర్లు నేరాలకు పాల్పడిన సమయంలో బాలలేనని ప్రకటించారు. బాల నేరస్తులుగా ప్రకటించడానికి జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేనప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. 13 మంది కేసులకు సంబంధించిన అప్పీళ్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.

18 ఏళ్లలోపు వారికి గరిష్టంగా మూడేళ్లు జైలు శిక్ష అని, అదీ జువెనైల్‌ గృహాల్లో ఉంచాలని జువెనైల్‌ జస్టిస్‌ యాక్ట్‌ , 2000 సెక్షన్‌ రెడ్‌విత్‌ సెక్షన్‌ 26 చెబుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. జువెనైల్‌ చట్టం ప్రకారం గరిష్టకాలం శిక్షఅనుభవించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ పిటిషన్లను గురువారం జస్టిస్‌ ఇందిరా బెనర్జీ జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ల ధర్మాసనం విచారించింది. బాల్యం దాటిన వారిని గుర్తించాలని అలహాబాద్‌ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, వారికి మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిందని అలహాబాద్‌ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ గరీమా ధర్మాసనానికి తెలిపారు. వారికి బెయిల్‌ మంజూరు చేయడానికి అభ్యంతరం లేదని, వెరిఫికేషన్‌ చేయాలని కోరుకుంటున్నామని ధర్మాసనాన్ని కోరారు. 

మరిన్ని వార్తలు