ఆ ఎన్నారై భర్తలపై జూలైలో విచారణ

23 Mar, 2021 06:33 IST|Sakshi

న్యూఢిల్లీ: భార్యలను వదిలేసిన, కట్నం కోసం వేధించిన ఎన్నారై భర్తలను తప్పనిసరిగా అరెస్టు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై జూలైలో విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. బాధిత మహిళల తరఫున వాదించడానికి సిద్ధంగా ఉన్నట్లు సీనియర్‌ న్యాయవాది కొలిన్‌ గొన్సాల్వెజ్‌ సోమవారం జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ ఏఎస్‌ బొపన్న, జస్టిస్‌ ఎస్‌.రామసుబ్రమణియన్‌ల ధర్మాసనానికి నివేదించారు. ఈ అంశంపై తాము వేరుగా పిటిషన్‌ వేశామనీ, దీనిపై న్యాయస్థానానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రవాసీ లీగల్‌ సెల్‌ తరఫున సంజయ్‌ హెగ్డే పేర్కొన్నారు. స్పందించిన ధర్మాసనం..ఈ పిటిషన్లపై జూలైలో విచారణ చేపట్టనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని కేంద్రం బదులిచ్చినట్లు కూడా ధర్మాసనం తెలిపింది.

కట్నం కోసం వేధించిన, భార్యలను వదిలివెళ్లిపోయిన ఎన్నారై భర్తలపై చర్యలు తీసుకోవాలంటూ కొందరు బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వేరుగా ఉంటున్న తమ భర్తలను అరెస్టు చేయాలనీ, ఈ విషయంలో విదేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాల ద్వారా తమకు సాయం అందించాలని వారు తమ పిటిషన్లలో అభ్యర్థించారు. ఇటువంటి కేసుల్లో సదరు భర్తలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైన వెంటనే లుకౌట్‌ నోటీసులు జారీ చేసి, అరెస్టు చేయాలంటూ వారి తరఫు న్యాయవాది సత్య మిత్ర కోరారు.

‘ఇటువంటి కేసుల్లో సదరు ఎన్నారై భర్తలు, న్యాయస్థానానికి హాజరు కాకుండా తప్పించుకోవడం, భారత్‌కు తిరిగి రాకపోవడం జరుగుతున్నాయి. ఈ విషయంలో వారి పాస్‌పోర్టు లను స్వాధీనం చేసుకుని, స్వదేశానికి రప్పించేం దుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్లలో కోరారు. ఇందుకోసం బాధితుల పక్షాన మానవీయ దృక్పథంతో పనిచేసేలా చూడాలని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు