ప్రశాంత్‌ భూషణ్‌కు రూపాయి జరిమానా!

1 Sep, 2020 05:46 IST|Sakshi

కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీం తీర్పు

న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ట్వీట్లు చేసిన నేరానికిగాను సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌కు ఒక రూపాయి జరిమానా విధించింది. న్యాయాన్ని అందించే వ్యవస్థ గౌరవాన్ని ప్రశాంత్‌ భూషణ్‌ తన ట్వీట్లతో తగ్గించారని వ్యాఖ్యానించింది. అయినప్పటికీ కఠిన శిక్షలేవీ విధించకుండా ఉదారంగా వ్యవహరిస్తున్నామని, నామమాత్రంగా రూపాయి జరిమానా చెల్లించాలని తీర్పులో పేర్కొంది. సెప్టెంబర్‌ 15లోగా ఈ మొత్తాన్ని సుప్రీంకోర్టులో జమచేయాలని, లేని పక్షంలో 3 నెలల జైలు, న్యాయవాద వృత్తి నుంచి మూడేళ్ల నిషేధం అనుభవించాల్సి ఉంటుందని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయి, జస్టిస్‌ కృష్ణమురారిలతో కూడిన  బెంచ్‌ సోమవారం తీర్పునిచ్చింది.

వాక్‌స్వాతంత్య్రాన్ని అదుపు చేయడం సరికాకపోయినప్పటికీ ఇతరుల హక్కులను గౌరవించాల్సిన అవసరముందని బెంచ్‌ వ్యాఖ్యానించింది. ప్రశాంత్‌ భూషణ్‌ తాను చేసిన ట్వీట్లకు క్షమాపణ చెప్పాలని బెంచ్‌ పదేపదే కోరిందని, అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ కూడా ఆ ట్వీట్లు క్షణికావేశంలో చేసినవిగా అభిప్రాయపడుతూ క్షమాపణ వ్యక్తం చేయాలని కోరారని బెంచ్‌ గుర్తు చేసింది. సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోక ముందే ప్రశాంత్‌ భూషణ్‌ కోర్టుకు సమర్పించిన ప్రకటనను మీడియాకు విడుదల చేశారని బెంచ్‌ గుర్తించింది. సుమారు 82 పేజీలున్న తీర్పును మంగళవారం పదవీ విరమణ చేయనున్న జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా చదివి వినిపించారు. తీర్పు ఎవరు రాశారన్నది ప్రతిపై లేకపోవడం విశేషం.  న్యాయవ్యవస్థపై, సుప్రీంకోర్టుపై తనకు అపారమైన గౌరవం ఉందని, తన ట్వీట్లు సుప్రీంకోర్టును అగౌరవపరిచేందుకు కాదని ప్రశాంత్‌ భూషణ్‌  అన్నారు. ‘సుప్రీంకోర్టు నన్ను దోషిగా నిర్ధారిస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిందిగా కోరే హక్కును ఉపయోగించుకుంటా. ఈ తీర్పు (జరిమానా)ను అంగీకరిస్తూ ఇంకే శిక్ష విధించినా అనుభవించేందుకు సిద్ధం. ఒక్క రూపాయి జరిమానా చెల్లిస్తా’అని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు