ఆస్పత్రులా.. రియల్‌ ఎస్టేట్‌ సంస్థలా?: సుప్రీంకోర్టు

20 Jul, 2021 03:40 IST|Sakshi

ప్రైవేట్‌ దవాఖానాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ ఆసుపత్రుల తీరుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కష్టకాలంలో ప్రజలకు సేవ చేయాల్సింది పోయి పక్కా రియల్‌ ఎస్టేట్‌ సంస్థల్లా వ్యవహరిస్తున్నాయని ఆక్షేపించింది. నివాస ప్రాంతాల్లో 2–3 పడక గదుల ఫ్లాట్లలో నర్సింగ్‌ హోమ్‌లు కొనసాగుతున్నాయని, కనీస భద్రతా ప్రమణాలు సైతం పాటించడం లేదని, రోగుల జీవితాలతో ఆడుకుంటున్నాయని మండిపడింది. అలాంటి వాటిని మూసివేయాలని ఆదేశించింది. భద్రతా ప్రమాణాలు, నిబంధనలు పాటించని హాస్పిటళ్లకు వచ్చే ఏడాది జూలై వరకూ గడువు (డెడ్‌లైన్‌) పొడిగిస్తూ గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది.

ఆసుపత్రుల్లో పాటించాల్సిన జాగ్రత్తల విషయంలో గత ఏడాది డిసెంబర్‌ 18న తాము ఒక ఉత్తర్వు జారీ చేశామని, అయినప్పటికీ అగ్ని ప్రమాదాలు జరిగి, రోగుల ప్రాణాలు గాల్లో కలుస్తూనే ఉన్నాయని పేర్కొంది. ‘‘ఆసుపత్రుల్లో లోపాలను వెంటనే సరిదిద్దుకోవాలి. ఈ విషయంలో గడువు పొడిగించడం సరైంది కాదు. రోగులను ఆరోగ్యవంతులుగా మార్చాల్సిన ఆసుపత్రులు కరెన్సీ ముద్రించే యంత్రాలుగా మారిపోయాయి’’అని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాల ధర్మాసనం పేర్కొంది. నివాస ప్రాంతాల్లో ఇరుకు ఇళ్లలో హాస్పిటళ్లను కొనసాగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. లోపాలను సరిదిద్దుకోవడానికి ఆసుపత్రులకు మరో ఏడాది గడువిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని గుజరాత్‌ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఈ నోటిఫికేషన్‌ జారీ చేయడానికి గల కారణాలపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది.

అత్యున్నత న్యాయస్థానం ఒక ఉత్తర్వు ఇచ్చిన తర్వాత దాన్ని ఉల్లంఘిస్తూ నోటిఫికేషన్‌ ఇవ్వడం ఏంటని నిలదీసింది. ఈ నోటిఫికేషన్‌ను బట్టి 2022 జూలై దాకా నిబంధనలు పాటించనక్కర్లేదని ఆసుపత్రులకు స్వేచ్ఛ ఇచ్చారని, అంటే అప్పటిదాకా జనం చచ్చిపోవాల్సిందేనా? అని ప్రశ్నించింది. గుజరాత్‌లో గత ఏడాది పలు కోవిడ్‌ ఆసుపత్రుల్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటనలను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలంటూ 2020 డిసెంబర్‌ 18న అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఫైర్‌ ఆడిట్‌ నిర్వహించడానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. 
 

మరిన్ని వార్తలు