వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లకు సుప్రీం చివాట్లు

15 Feb, 2021 13:38 IST|Sakshi

సోషల్‌ మీడియా దిగ్గజం వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, కేంద్రానికి నోటీసులు

సాక్షి, న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా దిగ్గజాలు వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. మీరు బిలియన్‌, ట్రిలియన్‌ డాలర్ల విలువ చేసే కంపెనీ కావొచ్చు. కానీ ప్రజల వ్యక్తిగత గోప్యత అంతకన్నా విలువైనది అని స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరిలో వాట్సాప్‌ కొత్త పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం.. వాట్సాప్‌ తన యూజర్ల బిజినేస్‌ సంభాషణలను ఫేస్‌బుక్‌తో షేర్‌ చేసుకుంటుంది. ఈ కొత్త పాలసీని అంగీకరించకపోతే ఫిబ్రవరి 8 నుంచి వారి మొబైల్స్‌లో వాట్సాప్‌ పని చేయదని వెల్లడించిన సంగతి తెలిసిందే. 

దీనిపై యూజర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కొత్త ప్రైవసీ పాలసీ వల్ల తమ వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుంతుదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కర్మన్య సింగ్‌ సరీన్‌, మరికొందరు కొత్త ప్రైవసీ పాలసీపై స్టే విధించాల్సిందిగా కోరతూ సుప్రీం కోర్టును కోరారు. ఈ అభ్యర్థన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ ఏ బోబ్డే కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘మీరు(వాట్సాప్‌) బిలియన్‌, ట్రిలియన్‌ డాలర్ల కంపెనీ కావచ్చు. కానీ ప్రజల వ్యక్తిగత గోప్యత అంతకన్నా విలువైనది. దానిని కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. మీ కొత్త ప్రైవసీ పాలసీ వల్ల తమ గోప్యతకు భంగం వాటిల్లుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాము ఎవరో ఒకరికి పంపిన సందేశాలను వాట్సాప్‌, ఫేస్‌బుక్తో పంచుకోవడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రైవసీని కాపాడటం కోసం మేం తప్పక జోక్యం చేసుకుంటాం’’ అని తెలిపారు. ఇందుకు సంబంధించి కేంద్రంతో పాటు, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ తరఫున కపిల్‌ సిబాల్‌, అరవింద్‌ దాతర్‌ తమ వాదనలు వినిపించారు. ప్రైవసీకి భంగం కలుగుతుందనే ఆరోపణలు వాస్తవం కాదని తెలిపారు. 

చదవండి: వెనక్కి తగ్గిన వాట్సాప్‌

మరిన్ని వార్తలు