పెగసస్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసు

18 Aug, 2021 03:40 IST|Sakshi

సోమవారం సమగ్ర అఫిడవిట్‌ దాఖలు చేస్తాం

సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా 

దేశ భద్రతకు సంబంధించిన సమాచారం వెల్లడించాలని కోరడం లేదు: ధర్మాసనం 

తదుపరి విచారణ 10 రోజులపాటు వాయిదా 

న్యూఢిల్లీ: పెగసస్‌ స్పైవేర్‌ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. అయితే, ఇందులో దేశ భద్రత, రక్షణకు సంబంధించిన గోప్యమైన సమాచారం ఏదైనా ఉంటే ప్రభుత్వం బయటపెట్టాలని తాము కోరడం లేదని తెలిపింది. పెగసస్‌పై వస్తున్న ఆరోపణల విషయంలో సమగ్ర అఫిడవిట్‌ దాఖలు చేస్తే వచ్చే సమస్య ఏమిటని కేంద్రాన్ని ప్రశ్నించింది. పెగసస్‌పై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ కొనసాగించింది. కేంద్రం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు.

ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఓఎస్‌ గ్రూప్‌ అభివృద్ధి చేసిన పెగసస్‌ స్పైవేర్‌ను భారత్‌లో అసలు ఉపయోగించారా? లేదా? అనే విషయం దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారమని చెప్పారు. ‘‘తమ ఫోన్లపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టినట్లు పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. వీరిలో ప్రముఖులతోపాటు సామాన్య పౌరులు కూడా ఉన్నారు. ఫోన్లు హ్యాక్‌ అయ్యాయని చెబుతున్నారు. పౌరుల ఫోన్లను హ్యాక్‌ చేయడానికి నిబంధనలు అంగీకరిస్తాయి. అయితే, సంబంధిత ప్రభుత్వ సంస్థ(కాంపిటెంట్‌ అథారిటీ) అనుమతితోనే ఫోన్లను హ్యాక్‌ చేయాల్సి ఉంటుంది. అనుమతితో చేస్తే ఎలాంటి తప్పు లేదు. అలాంటప్పుడు పెగసస్‌పై కోర్టులో సమగ్ర అఫిడవిట్‌ దాఖలు చేయడానికి కాంపిటెంట్‌ అథారిటీకి సమస్య ఏమిటి?’’ అని ధర్మాసనం నిలదీసింది. దేశ భద్రత, రక్షణకు సంబంధించి ఒక్క పదమైనా అఫిడవిట్‌లో ఉండాలని తాము ఆశించడం లేదని స్పష్టం చేసింది. 

కోర్టు నుంచి దాచలేం... 
పెగసస్‌పై ఎవరికీ ఏమీ చెప్పబోమంటూ కేంద్రం ఇప్పటిదాకా అనలేదని తుషార్‌ మెహతా గుర్తుచేశారు. అయితే, ఈ విషయాన్ని బహిరంగం చేయకూడదన్నదే తన ఉద్దేశమని వివరించారు. ఏ దేశ ప్రభుత్వమైనా ఎలాంటి సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తోందో బయటకు చెబితే దేశ శత్రువులు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు దాన్నొక అవకాశంగా మార్చుకునే ప్రమాదం ఉందన్నారు. వారి రహస్యాలు బయటపడకుండా ప్రభుత్వ సాఫ్ట్‌వేర్‌ను అడ్డుకోవానికి ముష్కరులు తమ వద్ద ఉన్న సాఫ్ట్‌వేర్‌లలో మార్పులు చేసుకొనే ముప్పు పొంచి ఉందని చెప్పారు. ఏ సాఫ్ట్‌వేర్‌ను వాడుతున్నాం, ఏది వాడడం లేదు అనేది జాతి భద్రతకు సంబంధించిన అంశమని, దాన్ని కోర్టు నుంచి దాచలేమని పేర్కొన్నారు.

వచ్చే సోమవారం ప్రభుత్వం సమగ్ర అఫిడవిట్‌ దాఖలు చేస్తుందని, పెగసస్‌పై తన వైఖరిని అందులో స్పష్టం చేస్తుందని తుషార్‌ మెహతా తెలిపారు. ఇప్పటికే దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్రం తన ప్రతిస్పందనను తెలిపిందని, తటస్థ నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించిందని, దేశ అత్యున్నత న్యాయం ముందుకు ప్రభుత్వం వచ్చిందని గుర్తుచేశారు. పెగసస్‌పై దాచడానికి ఏమీ లేదని కేంద్రం వెల్లడించిందని అన్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న మొత్తం సమాచారాన్ని తటస్థ నిపుణుల కమిటీకి అందజేస్తామని, ఆ కమిటీ విచారణ జరిపి, నివేదికను నేరుగా సుప్రీంకోర్టుకు సమర్పిస్తుందని చెప్పారు. దీంతో తదుపరి విచారణకు ధర్మాసనం 10 రోజుల పాటు వాయిదా వేసింది. దేశ రక్షణ ప్రభుత్వానికి ఎంత ముఖ్యమో ప్రజలకూ అంతే ముఖ్యమని పిటిషనర్ల తరపున వాదించిన సీనియర్‌ అడ్వొకేట్‌ కపిల్‌ సిబల్‌ వ్యాఖ్యానించారు. దేశ రక్షణకు సంబంధించిన సమాచారం ప్రభుత్వం బహిర్గతం చేయాలని తాము కోరడం లేదని అన్నారు.

మరిన్ని వార్తలు