నిరసనలు : సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

13 Feb, 2021 11:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపే హక్కుపై దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యంలో ఒక చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలపడం ప్రాథమిక హక్కే కానీ, ఆ కారణంగా రహదారుల దిగ్బంధనం జరగడం ఆందోళనకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో నిరసనలు తెలుపుతూ ప్రజారవాణకు ఇబ్బందులు కలగజేయడం సరైన పద్దతి కాదని అభిప్రాయపడింది. నెలల తరబడి రోడ్లపై ధర్నాలు, దీక్షలు చేయడం ప్రజలు హక్కులకు హరించడమేనని స్పష్టం చేసింది. కాగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్ట(సీఏఏ)కు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలోని షహిన్‌బాగ్‌ ఆందోళకారులు టెంట్లు వేసుకుని నిరసన దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే.

ప్రజలకు ఇబ్బంది కలగని ప్రాంతంలోకి తమ నిరసనల కేంద్రాన్ని మార్చుకోవాలని వ్యతిరేక ఆందోళనకారులకు ఆదేశించింది. నిరసన తెలిపే హక్కు ఉంటుందని కానీ దానిపేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని స్పష్టం చేసింది. గత ఏడాది మార్చిలో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ 12 మంది పౌరహక్కుల ఉద్యమకారులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఎస్‌కే కౌల్‌, అనురుద్‌ బోస్‌, కృష్ణ మురళీలతో కూడిన  ధర్మాసనం శనివారం తీర్పును వెలువరించింది. గతంలో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. తాజాగా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసింది. నిరసన తెలిపే హక్కు అనేది ఎల్లప్పూడు, ఎక్కడైనా ఉంటుందని అనుకోవడం సరైనది కాదని స్పష్టం చేసింది.
 

మరిన్ని వార్తలు