Disha Encounter Case: దిశ కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ఇవే..

21 May, 2022 07:50 IST|Sakshi

చర్యల బాధ్యత హైకోర్టుకు.. 

సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదికపై సుప్రీంకోర్టు ప్రకటన 

దోషులెవరో కమిషన్‌ గుర్తించింది.. దాపరికం లేదు 

 కేసును ఇకపై తెలంగాణ హైకోర్టు విచారిస్తుందన్న సీజేఐ ధర్మాసనం.. నివేదికను బయటపెట్టొద్దన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి తిరస్కరణ 

అభ్యంతరాలుంటే హైకోర్టుకు చెప్పుకోవాలని సూచన 

సాక్షి, న్యూఢిల్లీ: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి దోషులెవరో జస్టిస్‌ సిర్పూర్కర్‌ కమిషన్‌ గుర్తించిందని, ఇందులో దాపరికానికి తావులేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ నివేదిక ఆధారంగా ఏం చర్యలు చేపట్టాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర హైకోర్టుకే అప్పగిస్తున్నట్టు తెలిపింది. నివేదిక సాఫ్ట్‌ కాపీలను పిటిషనర్లకు, ప్రతివాదులందరికీ పంపాలని కమిషన్‌ సెక్రటేరియట్‌ను ఆదేశించింది. ఈ కేసును హైకోర్టుకు బదిలీ చేస్తామని.. నివేదికపై అభ్యంతరాలుంటే హైకోర్టుకు చెప్పుకొనే స్వేచ్ఛ ఇస్తున్నామని తెలిపింది. ఆయా అభిప్రాయాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. సుప్రీంకోర్టులో ఈ విచారణను ముగిస్తున్నామని ప్రకటించింది. 

నివేదికపై గోప్యత అవసరమేంటి? 
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మృతుల బంధువులు, న్యాయవాది జీఎస్‌ మణి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ హిమాకోహ్లిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ నిర్వహించింది. కేసు తీవ్రత దృష్ట్యా సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదికను సీల్డు కవర్‌లోనే ఉంచాలని, బహిర్గతం చేసేందుకు అనుమతించవద్దని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌ చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు బహిర్గతం చేయకూడదని సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు గతంలో కొన్ని కేసుల్లో నివేదికలను సీల్డు కవర్‌లోనే ఉంచిందని దివాన్‌ గుర్తుచేయగా.. ‘‘ఏదైనా దేశ భద్రతకు సంబంధించిన అంశాలుంటే పరిశీలిస్తాం. కానీ ఇది ఎన్‌కౌంటర్‌ కేసు. కమిటీ నివేదిక ఇచ్చింది.

అంతిమంగా ముగింపు ఉండాలి కదా.. నివేదికను చూడకుండా మీరు వాదించలేరు కదా.. కమిషన్‌ బహిరంగ విచారణ చేపట్టింది. అలాంటిది గోప్యత అవసరం ఏముంది?’’ అని జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రశ్నించారు. కేసు రోజువారీ విచారణ సుప్రీంకోర్టులో సాధ్యం కాదని, కమిషన్‌ నివేదిక అనంతరం చర్యలు ఏమిటనే ప్రశ్న కూడా ఉందని గుర్తుచేశారు. ఇక సుప్రీంనియమించిన కమిటీ ఇచ్చిన నివేదికను ప్రజల ముందు ఎందుకు ఉంచరాదో చెప్పాలని జస్టిస్‌ హిమా కోహ్లి ప్రశ్నించారు. నివేదికను సీల్డు కవర్‌లోనే ఉంచాలని శ్యాం దివాన్‌ మరోసారి అభ్యర్థించినా జస్టిస్‌ ఎన్‌వీ రమణ తిరస్కరించారు. దేశంలో ఎలాంటి దారుణమైన ఘటనలు జరుగుతున్నాయో చూస్తున్నామని వ్యాఖ్యానించారు. ‘‘ఈ కేసును పర్యవేక్షించలేం కాబట్టి హైకోర్టుకు తిరిగి పంపాల్సి ఉంటుంది. జస్టిస్‌ సిర్పూర్కర్‌ కమిషన్‌ వివరణాత్మక నివేదిక సమర్పించింది. అయితే సరైన చర్య ఏమిటన్నదే ప్రశ్నగా ఉంది. కమిషన్‌ కొన్ని సిఫార్సులు కూడా చేసింది. ఈ కేసును హైకోర్టుకు పంపుతాం’’ అని పేర్కొంటూ విచారణను ముగించారు.  


నిష్పక్షపాతంగా నివేదిక 
సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదిక నిష్పక్ష పాతంగా ఉంది. న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించింది. నివేదిక అంశాలను చూస్తే బాధిత కుటుంబాలకు సగం న్యాయం అందినట్టే ఉంది. హైకోర్టు మీద నమ్మకంతో పూర్తి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. 
– పీవీ కృష్ణమాచారి,
మృతుల కుటుంబాల తరఫు
న్యాయవాది, ఇండిపెండెంట్‌ కౌన్సిల్‌ 

నిందితుల కుటుంబాలకుసమాచారమే లేదు 
శుక్రవారం సుప్రీంకోర్టులో దిశ కేసు
విచారణ జరగనుందన్న విషయంపై తమకు సమాచారం లేదని నిందితుల కుటుంబ సభ్యులుతెలిపారు. మరోవైపు దిశ కేసు విచారణ పూర్తయ్యే వరకూ మృతుల కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. గత మూడు నెలలుగా తమ ఇళ్ల ముందు పోలీసు భద్రతేదీ లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మధ్య మధ్యలో పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనంలో వచ్చి కాసేపు ఉండి
వెళుతున్నారని చెప్పారు.   

ఇది కూడా చదవండి: తుది దశకు ‘దిశ’ ఎన్‌కౌంటర్‌ కేసు 

మరిన్ని వార్తలు