సుప్రీంకోర్టులో మొదలైన ప్రత్యక్ష ప్రసారాలు.. కేసుల విచారణలు చూసేయండి

27 Sep, 2022 12:52 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. మంగళవారం తమ కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం ప్రారంభించింది. సుప్రీంకోర్టులోని మూడు వేర్వేరు రాజ్యాంగ ధర్మాసన కేసుల విచారణను లైవ్‌ స్ట్రీమింగ్‌ చేస్తోంది. వీటిని యూట్యూబ్‌లో అందుబాటులో ఉంచారు. రానున్న రోజుల్లో సొంత వేదిక ద్వారా విచారణలు ప్రసారం చేయనున్నట్లు సీజేఐ యూయూ లలిత్‌ తెలిపారు. 

ప్రస్తుతానికి రాజ్యాంగ ధర్మాసన విచారణను మాత్రమే ప్రసారం చేస్తున్నారు. తర్వాత మిగతా అన్నింటిని లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయనున్నారు. కోర్టులో జరిగే వాదనలకు, లైవ్‌ స్ట్రీమింగ్‌కు 30 సెకన్లు వ్యవధి తేడా ఉండనుంది. కాగా మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ పదవీ విరమణ రోజు ఆగస్టు 26న తొలిసారి ధర్మాసనం కార్యకలాపాలను దేశ ప్రజలంతా వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారం చేశారు. 

అయితే నాలుగేళ్ల క్రితం 2018 సెప్టెంబర్‌ 27సుప్రీంకోర్టు కేసుల వాదనలను లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయాలని అప్పటి సీజేఐ దీపక్‌ మిశ్రా నిర్ణయం తీసుకున్నారు. అయినా ఇప్పటి వరకు ఆచరణలోకి రాలేదు. చివరికి సెప్టెంబర్‌ 27 నుంచి అన్ని రాజ్యాంగ ధర్మాసన కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని  సీజేఐ యూయూ లలిత్‌ ఈనెల 20న నిర్ణయించారు.

మొదటి స్ట్రీమింగ్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ అధ్యక్షతన ఇడబ్ల్యూఎస్ కోటా కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసు 103వ రాజ్యాంగ సవరణను సవాలు చేస్తూ దాఖలైందిద. మరో విచారణలో మహారాష్ట్రలోని ఉద్దవ్‌ ఠాక్రే Vs ఏక్‌నాథ్‌ షిండే వర్గం మధ్య విబేధాలకు సంబంధించిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇక  జస్టిస్ ఎస్కే కౌల్ అధ్యక్షతన జరిగే మూడో విచారణలో ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ చెల్లుబాటుకు సంబంధించిన అంశంపై వాదనలు కొనసాగుతున్నాయి.
చదవండి: జపాన్ ప్రధానికి మోదీ ఘన నివాళులు

మరిన్ని వార్తలు