గోప్యత హక్కు చాలా ముఖ్యం

28 Oct, 2021 05:02 IST|Sakshi

‘పెగాసస్‌’పై విచారణకు నిపుణుల కమిటీ

జస్టిస్‌ రవీంద్రన్‌ నేతృత్వంలో దర్యాప్తు బృందం

జాతీయ భద్రతకు చెందిన అంశమని మౌనం వహించలేం

సొంతంగా కమిటీ ఏర్పాటు చేస్తామన్న కేంద్రం విజ్ఞప్తి

తిరస్కరించిన సుప్రీంకోర్టు

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కొంతమంది విపక్ష నేతలు, ప్రముఖులు, పాత్రికేయులపై నిఘా ఉంచడానికి కేంద్రప్రభుత్వం ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్‌ పెగాసస్‌ వినియోగించిందంటూ వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు కమిటీ నియమించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌వీ రవీంద్రన్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది.

దేశంలో 300మందికి పైగా మొబైల్‌ ఫోన్లపై నిఘా ఉంచారంటూ మనోహర్‌లాల్‌ శర్మ,  ఎడిటర్స్‌ గిల్డ్‌ సహా పలువురు జర్నలిస్టులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలో జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం బుధవారం 46 పేజీల తీర్పు ఇచ్చింది. ఈ అంశంపై దర్యాప్తునకు నిపుణుల కమిటీని తామే ఏర్పాటు చేస్తామన్న కేంద్రం విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రజాస్వామ్య దేశంలో అక్రమంగా వ్యక్తులపై నిఘా పెట్టడాన్ని అనుమతించలేమని స్పష్టం చేసింది.

జాతీయ భద్రతతో ముడిపడిన అంశమని చెప్పి కేంద్రం ప్రతిదాన్నీ దాటవేయలేదని స్పష్టం చేసింది. పౌరుల వ్యక్తిగత గోపత్య హక్కుకు సంబంధించి ఇటీవలికాలంలో అత్యంత కీలకమైన తీర్పును వెలువరిస్తూ... జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని చెప్పి... న్యాయవ్యవస్థను మౌనప్రేక్షక పాత్రకు పరిమితం చేయలేరని విస్పష్టంగా పేర్కొంది. నిపుణుల కమిటీని వారి సమాచారాన్ని వ్యక్తిగతంగా సేకరించి, పరిశీలించి నియమించామని తెలిపింది. సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ ఫోరెన్సిక్, నెట్‌వర్క్, హార్డ్‌వేర్‌ వంటి సాంకేతిక అంశాల్లో అత్యంత ప్రతిభావంతులైన నిపుణులను ఎంపిక చేసి పారదర్శక దర్యాప్తు నిమిత్తం కమిటీలో నియమించామని పేర్కొంది.

సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌వీ రవీంద్రన్‌ కమిటీకి నేతృత్వం వహిస్తారని, దర్యాప్తు పారదర్శకంగా, సమర్థంగా జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కమిటీకి టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ (టీఓసీ)ను తీర్పులో పొందుపరిచింది. కమిటీ దర్యాప్తును స్వయంగా పర్యవేక్షిస్తామని జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. పెగాసస్‌పై సమగ్రంగా పరిశీలించి, దర్యాప్తు అనంతరం నివేదికను కోర్టుకు అందించాలని కమిటీని ఆదేశించింది. ఎనిమిది వారాల అనంతరం ఈ అంశంపై విచారణ చేస్తామని పేర్కొంది. కోర్టు నియమించిన కమిటీకి కావాల్సిన వసతి, ఇతరత్రా సౌకర్యాలు, సమాచారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఏజెన్సీలు అందించాలని ఆదేశించింది. దేశప్రజలపై విదేశీ ఏజెన్సీలు, ప్రైవేటు సంస్థలు నిఘా ఉంచడాన్ని గమనించిన ధర్మాసనం ఈ అంశాన్ని కూడా దర్యాప్తు చేయాలని కమిటీని ఆదేశించింది.   

నిబంధనలకు లోబడే ఉండాలి...
దేశంలో సైబర్‌ సెక్యూరిటీని బలోపేతం చేయాల్సి ఉందన్న సుప్రీంకోర్టు జాతీయ భద్రత విషయంలో న్యాయవ్యవస్థ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది, అయితే,  న్యాయసమీక్షకు వ్యతిరేకంగా దేన్నిపడితే దాన్ని నిషేధించే అవకాశం లేదని స్పష్టం చేసింది. జాతీయ భద్రత అనేది ఎప్పుడుపడితే అప్పుడు ఉపయోగించే అంశం కాదని తెలిపింది. ఆ ప్రస్తావన వచ్చినపుడల్లా న్యాయవ్యవస్థ జోక్యం అవసరమని అభిప్రాయపడడం లేదని తెలిపింది. జాతీయ భద్రతపై భయాందోళనలు తలెత్తినపుడల్లా కేంద్రానికి తప్పించుకొనే అవశాకం వస్తుందని కాదని, అలాగని తిరస్కరించే అవకాశం కూడా ఉందని తెలిపింది.

ఇలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినపుడు కేంద్రం తననితాను నిరూపించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. సమాచారం బహిర్గతం కావడం అనేది జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను  ప్రభావితం చేస్తుందని చెప్పి దీనిపై కోర్టు అన్నివేళలా మౌనంగా వ్యవహరించబోదని స్పష్టం చేసింది. దేశంలో ప్రజలందరికి గోప్యత హక్కు చాలా ముఖ్యమని పేర్కొంది. ప్రజల జీవితాలు మెరుగుకావడానికి సాంకేతిక సాధనమైనప్పటికీ దాని వల్లే గోప్యత ఉల్లంఘనలు జరుగుతున్నాయని తెలిపింది. ‘గోప్యత అనేది జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలకు మాత్రమే సంబంధించింది కాదు.

గోప్యత ఉల్లంఘనల నుంచి ప్రతి పౌరుడికి రక్షణ, భద్రత ఉండాలి. ఇదే వ్యక్తిగత స్వేచ్ఛను ఉయోగించుకునేలా చేస్తుంది‘ అని ధర్మాసనం పేర్కొంది. ఇతర హక్కుల మాదిరిగానే గోప్యత హక్కు కూడా పరిమితులకు లోబడే ఉంటుందని, అవి రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని పేర్కొంది. ఉగ్రవాదంపై పోరాటానికి నిఘా ఎంతో అవసరమని, ఈ పరిస్థితుల్లో వ్యక్తుల గోప్యత హక్కులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం వస్తుందని, ఇది జాతీయ భద్రత, ప్రయోజనాల కోసమే నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది. గోప్యత హక్కు ఉల్లంఘన ఆరోపణల విషయంలో సదరు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం సరైనా సాక్ష్యాధారాల ద్వారానే జరగాలని తెలిపింది.

ప్రజాస్వామ్య దేశాల్లో విచక్షణారహితంగా వ్యక్తులపై నిఘా, గూఢచర్యం అనుమతించడానికి వీల్లేదని పేర్కొంది. మీడియాపై నిఘా అనేది పబ్లిక్‌ వాచ్‌ డాగ్‌ పాత్రపై దాడి చేసినట్లుగా ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇలా చేయడం  కచ్చితత్వంతో కూడిన నమ్మదగిన సమాచారాన్ని అందించే పత్రిక సామర్థ్యాన్ని అణగదొక్కడమేనని పేర్కొంది. పెగాసస్‌పై తొలి ఆరోపణల నుంచి కేంద్రం తగిన వైఖరి వెల్లడించలేదని, అయినప్పటికీ రెండేళ్లుగా కోర్టు తగిన సమయం ఇచ్చిందని తెలిపింది. జాతీయ భద్రతా సమస్యలను ప్రభావితం చేసే ఏ సమాచారాన్నైనా బహిర్గతం చేయాలని కేంద్రంపై తామెప్పుడు ఒత్తిడి చేయబోమని ధర్మాసనం స్పష్టం చేసింది.

కమిటీ సభ్యులు
జస్టిస్‌ ఆర్‌వీ రవీంద్రన్‌:  ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తులపై ఇటీవల కుట్ర ఆరోపణలు వచ్చినపుడు విచారణకు నియమితులైన  జస్టిస్‌ ఆర్‌వీ రవీంద్రన్‌ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. జస్టిస్‌ రవీంద్రన్‌ న్యూస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ (ఎన్‌బీఎస్‌ఏ)కు 2013 నుంచి 2019 వరకూ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.  

ఆలోక్‌ జోషి: 1976 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆలోక్‌ జోషి ఇంటెలిజెన్స్‌ బ్యూరో సంయుక్త డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. విశేషమైన దర్యాప్తు అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. రిసెర్చ్, ఎనాలసిస్‌ వింగ్‌ (రా)లో కార్యదర్శిగా, నేషనల్‌ టెక్నికల్‌ రిసెర్చీ ఆర్గనైజేషన్‌కు ఛైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. జస్టిస్‌ రవీంద్రన్‌కు సహాయకారిగా ఈ కమిటీలో సభ్యుడిగా సుప్రీంకోర్టు నియమించింది.  

డాక్టర్‌ సందీప్‌ ఒబెరాయ్‌ : ప్రపంచవ్యాప్తంగా సైబర్‌ సెక్యురిటీ నిపుణుడుగా గుర్తింపు పొందారు. టీసీఎస్‌ సైబర్‌ సెక్యూరిటీస్‌ సర్వీసెస్‌ గ్లోబల్‌ హెడ్‌గా పనిచేశారు. సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల రంగంలో సదుపాయాల అభివృద్ధికి సబ్‌ కమిటీ అయిన ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ స్టాండరైజేషన్‌ ఇంటర్నేషనల్‌ ఎలక్ట్రో టెక్నికల్‌ కమిషన్, జాయింట్‌ టెక్నికల్‌ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించారు.  

సాంకేతిక కమిటీ సభ్యులు  
డాక్టర్‌ నవీన్‌కుమార్‌ చౌధరి: సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ ఫోరెన్సిక్‌ ప్రొఫెసర్‌ అయిన నవీన్‌ కుమార్‌ గుజరాత్‌లోని నేషనల్‌ ఫొరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ డీన్‌గా పనిచేశారు. రెండు దశాబ్దాలకు పైగా ఉపాధ్యాయుడిగా పనిచేయడంతోపాటు సైబర్‌ సెక్యూరిటీ ఎనేబులర్‌గా, సైబర్‌ సెక్యురిటీ నిపుణుడిగా పేరుగాంచారు. సైబర్‌ సెక్యూరిటీ పాలసీ, నెట్‌వర్క్, వల్నరబిలిటీ అసెస్‌మెంట్, పెనట్రేషన్‌ టెస్టింగ్‌లో అనుభవంగల వారు.  

డాక్టర్‌ పి.ప్రభాహరన్‌: కేరళలోని అమృత విశ్వ విద్యాపీఠంలో స్కూల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌ ప్రభాహరన్‌. కంప్యూటర్‌ సైన్స్, సెక్యూరిటీకి సంబంధించి రెండు దశాబ్దాల అనుభవం ఈయన సొంతం. మాల్‌వేర్‌ డిటెక్షన్, క్రిటికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్‌సెక్యూరిటీ, కాంప్లెక్స్‌ బైనరీ ఎనాలసిస్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్‌లో నిపుణులు. పలు జర్నల్స్‌లో ప్రభాహరన్‌ వ్యాసాలు ప్రచురితమయ్యాయి.  

డాక్టర్‌ అశ్విన్‌ అనిల్‌ గుమస్తే: బాంబే ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌టెక్నాలజీ (ఐఐటీ)లో కంప్యూటర్‌సైన్స్‌ ఇంజినీరింగ్‌లో ఇన్‌స్టిట్యూట్‌ ఛైర్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌. ఈయన పేరు మీద 20 యూఎస్‌ పేటెంట్లు ఉన్నాయి. 150 పత్రాలు వివిధ «జర్నల్స్‌లో ప్రచురితం కాగా మూడు పుస్తకాలు రాశారు. విక్రమ్‌సారాభాయ్‌ అవార్డు (2012), శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ అవార్డు (2018)లో అందుకొన్నారు. అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ విజిటింగ్‌ ప్రొఫెసర్‌.

పరిశీలించే అంశాలు...
భారతీయుల ఫోన్లు, ఇతరత్రా పరికరాలను పెగాసస్‌ స్పైవేర్‌ను వినియోగించి వారి సంభాషణలను ఆలకించడం, ఫోన్లలో నిల్వ ఉన్న సమాచారాన్ని సేకరించడం, లేదా ఇతరత్రా ప్రయోజనాల కోసం వినియోగించడం కేంద్ర ప్రభుత్వం చేసిందా?. అలా చేస్తే బాధితుల వివరాలు ఏంటి? పెగాసస్‌ వినియోగించి 2019లో భారతీయుల వాట్సాప్‌ ఖాతాలు హ్యాకింగ్‌కు గురైనప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది,  ఏయే చర్యలు తీసుకుంది ?. కేంద్రం పెగాసస్‌ సహా ఏ తరహావైనా స్పైవేర్లను కలిగి ఉందా? భారతీయులపై కేంద్ర దర్యాప్తు సంస్థ దాన్ని వినియోగించిందా?. ఒకవేళ కేంద్ర దర్యాప్తు సంస్థ భారతీయులపై ఆ తరహా స్పైవేర్‌ను వినియోగించి ఉంటే ఏ చట్ట ప్రకారం, ఏ నిబంధనల ప్రకారం లేదా ప్రోటోకాల్, న్యాయ సంబంధిత అంశం ద్వారా చేపట్టింది? భారతదేశానికి సంబంధించిన సంస్థ/వ్యక్తులు స్పైవేర్‌ వినియోగించినట్లైతే వారికి ఉన్న అధికారం ఏంటి? ఇతరత్రా సంబంధిత అంశాలు, ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అనేది కమిటీ పరిశీలించాలి.  

>
మరిన్ని వార్తలు