40- Storey Noida Towers: కుమ్మక్కయ్యారు.. కూల్చేయండి

1 Sep, 2021 05:28 IST|Sakshi

నోయిడాలో 40 అంతస్తుల జంట భవంతులపై సుప్రీంకోర్టు

సాక్షి, న్యూఢిల్లీ: నోయిడాలో సూపర్‌టెక్‌ లిమిటెడ్‌కి చెందిన ఎమరాల్డ్‌ కోర్ట్‌ ప్రాజెక్టు 40 అంతస్తుల జంట భవనాలను కూల్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2014లో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును కోర్టు సమర్థించింది. నిబంధనలకు విరుద్ధంగా భవనాల నిర్మాణం చేపడుతున్నారంటూ దాఖలైన పిటిషన్లను విచారించి కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. మూడు నెలల్లో కూల్చివేత పూర్తిచేయాలని, దానికయ్యే ఖర్చులు మొత్తం బిల్డర్‌ భరించాలని పేర్కొంది.

రెండు టవర్ల (టి–16, టి–17) ఫ్లాట్‌ యజమానులకు మొత్తం సొమ్ము 12 శాతం వడ్డీతోసహా తిరిగి చెల్లించాలని స్పష్టం చేసింది. బిల్డర్‌తో కుమ్మక్కయిన నోయిడా అధికారులను ప్రాసిక్యూట్‌ చేయాలని పేర్కొంది. బిల్డర్లు, నోయిడా అధికారుల కుమ్మక్కయిన విధానం ఈ కేసు రికార్డు చూస్తే అర్థం అవుతోందని, ప్రణాళికా విభాగం అధికారుల ఉల్లంఘన స్పష్టమవుతోందని పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో... అదీ ముఖ్యంగా మెట్రోపాలిటన్‌ సిటీల్లో అనధికార నిర్మాణాలలో విపరీతమైన పెరుగుదల, సందేహాస్పదమైన లావాదేవీలు గతంలో కోర్టు గుర్తించినట్లు తెలిపింది. బిల్డర్లు, ప్లానింగ్‌ అథారిటీ మధ్య ఇలాంటి కుమ్మక్కు లావాదేవీలు చిన్నస్థాయిలో జరిగేది కాదని తీర్పులో పేర్కొంది.

చదవండి: మౌఖిక ఆదేశాలొద్దు: సుప్రీంకోర్టు

మరిన్ని వార్తలు