సెక్స్‌ వర్కర్లకు ఓటర్‌ ఐడీలు, ఆధార్‌ కార్డులు

15 Dec, 2021 12:27 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వృత్తి, ఉద్యోగాలతో సంబంధం లేకుండా అందరికీ ప్రథమిక హక్కులు కల్పించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సెక్స్ వర్కర్లకు ఆధార్‌ కార్డు, ఓటర్‌ కార్డు, రేషన్‌ కార్డులు అందించాలని ఆదేశించింది. గుర్తింపు కార్డులు లేనివారికి కూడా రేషన్‌ బియ్యం ఇవ్వాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో సెక్స్ వర్కర్లు సమస్యలపై వేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేట్టింది.

సెక్స్‌ వర్కర్లకు రేషన్‌కార్డులు అందించాలని 2011లో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ అమలుకు నోచుకోలేదని న్యాయమూర్తులు ఎల్‌.నాగేశ్వరరావు, బీఆర్‌ గవాయి, బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. సెక్సు వర్కర్లుకు రేషన్‌ కార్డులు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుమారు దశాబ్దం కిందనే ఆదేశించినా ఎందుకు అమలు చేయడంలేదని సుప్రీంకోర్టు సీరియస్‌ అయింది. పౌరులు చేసే వృత్తి, ఉద్యోగానికి సంబంధం లేకుండా ప్రతిఒక్కరికీ ప్రాథమిక హక్కులు ఉన్నాయని తెలిపింది. దేశంలోని ప్రజలకు ప్రభుత్వాలు విధిగా అన్ని సౌకర్యాలని కల్పించాలని గుర్తుచేసింది.

వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెక్స్ వర్కర్లకు రేషన్‌, ఓటర్‌ కార్డులను అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆదేశించింది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంఘాల సహాయం తీసుకోవాలని తెలిపింది. కమ్యూనిటీ ఆధారిత సంస్థలు అందించిన సమాచారంతో సెక్స్ వర్కర్ల జాబితాను సిద్ధం చేసుకోవాలని పేర్కొంది. సెక్స్ వర్కర్లకు అందించే ఐడీ కార్డులను తయారు చేసే క్రమంలో వారి పేర్లు, గుర్తింపును గోప్యంగా ఉంచాలని సుప్రీం కోర్టు సూచించింది.

మరిన్ని వార్తలు