మేమే కమిటీ వేస్తాం: సుప్రీం

17 Dec, 2020 06:34 IST|Sakshi

న్యూఢిల్లీ: గత 20 రోజులకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తోన్న రైతాంగం సమస్యల పరిష్కారానికి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేంగా గడ్డకట్టే చలినిసైతం లెక్కచేయకుండా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తోన్న రైతాంగం సమస్య పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని కోర్టు ఎత్తిచూపింది. రైతుల సమస్య పరిష్కారం కాకపోతే ఇది జాతీయ సమస్యగా మారే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది. ఇదే నేపథ్యంలో యావత్‌ దేశంలోని రైతు సంఘాలతో కలిపి తామే ఒక కమిటీని నియమించనున్నట్టు తేల్చి చెప్పింది. సమస్య పరిష్కారం విషయంలో ఇరు పక్షాలకు చిత్తశుద్ధి అవసరమని చెప్పకనే చెప్పింది. చర్చలు ఫలవంతం కావాలన్న అభిలాశ ఇరుపక్షాలకూ ఉండాలని, అప్పుడే చర్చలు ఫలవంతం అవుతాయని కోర్టు అభిప్రాయపడింది. అటువంటి  సంస్థల పేర్లను తెలియజేయాల్సిందిగా కోర్టు, ప్రభుత్వం తరఫున వాదించిన సొలిసిటర్‌ జనరల్‌ని కోరింది.

రేపటిలోగా చెప్పండి
వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తోన్న రైతాంగాన్ని అక్కడి నుంచి ఖాళీ చేయించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం రైతుల సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, ఇది ఇలాగే కొనసాగితే ఇది జాతీయ సమస్యగా మారే ప్రమాదం ఉన్నదని అభిప్రాయపడింది. సంబంధిత రైతాంగం వాదనలను వినేందుకు సైతం కోర్టు సమ్మతిని తెలియజేసింది. అలాగే ప్రజాప్రయోజన వ్యాజ్యంపై  రేపటిలోగా సమాధానమివ్వాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏ చర్యలు చేపట్టలేదని సొలిసిటర్‌ జనరల్‌ విచారణ సందర్భంగా కోర్టుకి వెల్లడించారు. ప్రభుత్వంతో చర్చలు జరపాల్సిందిగా రైతులకు సూచించాలని ఆయన కోర్టుని కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జరిపిన చర్చలు సత్ఫలితాలనివ్వలేదని చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు