యూపీఎస్సీ జిహాద్‌ : ఎవరిపై కుట్ర?

17 Sep, 2020 13:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటుతున్నప్పటికి ఓ వర్గంపై మరో వర్గం బురదజల్లే ప్రయత్నాలు మాత్రం మానడంలేదు. భారత్‌ లౌకిక దేశమని నేతలంతా గర్వంగా రాజకీయ ప్రకటనలు చేస్తున్నా.. మైనార్టీ వర్గాలపై మాత్రం ఏదో ఒక విధంగా వివక్ష చూపుతూనే ఉన్నారు కొందరు. ఇటీవల ఓ మీడియా ప్రసారం చేసిన ఓ కథనమే దీనికి నిదర్శనం. సమాజంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన మీడియా ఓ వర్గాన్ని కించపరుస్తూ కథనాలు టెలికాస్ట్‌ చేయడం సరైనది కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం మెట్టికాయలు వేయడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది.

దేశ రాజధాని ప్రాంతం కేంద్రంగా విధులు నిర్వర్తిస్తున్న టెలివిజన్‌ సంస్థ సుదర్శన్ టీవీ‌. ఇటీవల ఈ టీవీలో ఓ ఎపిసోడ్‌ ప్రసారమైంది. ‘యూపీఎస్సీ జిహాద్‌’ పేరిట ఆ సంస్థ ప్రసారం చేసిన కార్యక్రమం తీవ్ర వివాదాస్పదమైంది. దేశంలో మైనార్టీలుగా ఉన్న ముస్లింలు  కేంద్ర సంస్థల్లోకి పెద్ద ఎత్తున రిక్రూట్‌ అవుతున్నారు అనేది ఆ కార్యక్రమం సారాంశం. దేశ జనాభాలో కేవలం 13 నుంచి 15 శాతం ఉన్న ముస్లింలు  పెద్ద సంఖ్యలో కేంద్ర సంస్థల్లోకి ప్రవేశిస్తున్నారని, దీని వెనుక ఎవరికీ తెలియని ఓ రహస్యం దాగిఉందనేది నిర్వహకుల అభిప్రాయం. (బీజేపీకి ఊహించని షాకిచ్చిన మిత్రపక్షం)

అయితే ఓ వర్గాన్ని కించపరుస్తూ సుదర్శన్‌ టీవీ నిర్వహిస్తున్న యూపీఎస్సీ జిహాద్‌ కార్యక్రమాన్ని నిషేధించాలని పలువురు సివిల్స్‌ అధికారులు సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. అప్పటికీ ఆ షో మూడు ఎపిసోడ్స్‌ని కూడా ప్రచారం చేసింది. దీనిపై రెండురోజుల క్రితం విచారణ చేపట్టిన జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం టీవీ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లౌకిక దేశంలో ఓ వర్గాన్ని నేరుగా టార్గెట్‌ చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని, వెంటనే ఆ షోను నిలిపివేయాలని ఆదేశించింది. స్వతంత్ర ప్రతిపత్తి గల యూపీఎస్సీ  ప్రతిష్ట దెబ్బతినే విధంగా షో ఉందని ఆక్షేపించింది. వాక్ స్వాతంత్రం పేరుతో ఇష్టం వచ్చిన విధంగా వ్యవహరిస్తామంటే ఊరుకునే ప్రసక్తేలేదని న్యాయస్థానం స్పష్టం చెప్పింది. ఇకపై తదుపరి షోలను టెలికాస్ట్‌ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు సైతం జారీచేసింది. (30న బాబ్రీ కూల్చివేత తీర్పు)

కాగా కేంద్ర ప్రభుత్వం గణాంకాల ప్రకారం.. 2019 సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో మొత్తం 829 మంది అభ్యర్థులు సెలెక్ట్‌ అయితే వారిలో 42 మంది ముస్లిం కమ్యూనిటికి చెందిన అభ్యర్థులు ఉన్నారు. అంటే మొత్తంలో 5శాతం మంది కేంద్ర సర్వీసులకు అర్హత సాధించారు. ఇక 2018లో మొత్తం 759 మంది అభ్యర్థులు అర్హత సాధిస్తే వారిలో 28 మంది ముస్లింలు ఉన్నారు. ఇక 2012, 13,14లో వరుసగా 30,34,38 మంది చొప్పున అభ్యర్థులు ఎన్నికవుతూ వస్తున్నారు. కాగా జాతీయ స్థాయిలోనూ మైనార్టీల ప్రాతినిధ్యం పెరగాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలను తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రత్యేక సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యే అభ్యర్థుల కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్స్‌తో పాటు మైనార్టీలకూ ప్రత్యేకంగా స్టడీ సర్కిల్స్‌ను ఏర్పాటు చేస్తోంది. మరోవైపు ముస్లింలపై కుట్ర పన్నేవిధంగా షోలు నిర్వహించడం సరైనదికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు