పూర్తి సహకారమందిస్తాం

12 Nov, 2021 06:11 IST|Sakshi

 ‘పెగాసస్‌’పై నిపుణుల కమిటీపై మంత్రి వైష్ణవ్‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దుమారం రేపిన పెగాసస్‌ స్పైవేర్‌ నిఘా వ్యవహారంపై దర్యాప్తు కొనసాగించనున్న నిపుణుల కమిటీకి తమ పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం గురువారం స్పష్టంచేసింది. ప్రతిపక్ష నేతలు, సామాజిక ఉద్యమ కారులు, పాత్రికేయులు తదితరులపై కేంద్ర ప్రభుత్వం పెగాసస్‌ స్పైవేర్‌ సాఫ్ట్‌వేర్‌ సాయంతో నిఘా పెట్టిందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తడం తెల్సిందే. దీంతో ఈ ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు సుప్రీంకోర్టు ముగ్గురు స్వతంత్య్ర సభ్యులతో ఒక నిపుణుల కమిటీని ఇటీవల ఏర్పాటుచేసింది.

ఈ కమిటీకి కావాల్సిన మౌలిక, మానవ వనరుల, ల్యాబొరేటరీ వసతులు, సమాచారం ఇలా అన్ని రకాల సహాయసహకారాలను కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అందిస్తుందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్పష్టంచేశారు. గురువారం ఢిల్లీలో జరిగిన ‘టైమ్స్‌ నౌ సమ్మిట్‌ 2021’లో మంత్రి ప్రసంగించారు. ‘ చట్టాన్ని మీరి మోదీ సర్కార్‌ ఎలాంటి తప్పు చేయలేదు. ఈ విషయంలో మాకు ఎలాంటి చింతా లేదు. నిపుణుల కమిటీ తుది నివేదిక ఎలా ఉన్నా మాకొచ్చే ఇబ్బంది ఏమీ లేదు’ అని ఆయన ధీమా వ్యక్తంచేశారు.

‘ ఇంతవరకూ దేశాన్ని పాలించిన ఏ ప్రభుత్వమూ పెగాసస్‌ స్పైవేర్‌ను కొనలేదంటారా?’ అన్న సూటి ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. ‘ఈ విషయాన్ని పార్లమెంట్‌ వేదికగా గతంలోనే స్పష్టంచేశాం. చట్టాల చట్రంలోనే మా పాలన కొనసాగుతోంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే ఆయా చట్టాలను గతంలో రూపొందించారు. ఆ చట్టాల నాలుగు గోడల మధ్యే మేమున్నాం’ అని మంత్రి వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాలపై నియంత్రణపై ఆయన మాట్లాడారు. మన సంస్కృతి దెబ్బతినకుండా, భవిష్యత్‌ పరిణామాలకు తగ్గట్లుగా ఐటీ మార్గదర్శకాలు రూపొందాయన్నారు.

మరిన్ని వార్తలు