దుస్తుల పైనుంచి తాకినా లైంగిక వేధింపే

19 Nov, 2021 06:19 IST|Sakshi

లైంగిక వాంఛనే ప్రధానంగా చూడాలి

ఎలా తాకారన్నది అనవసరం 

బాంబే హైకోర్టు వివాదాస్పద స్కిన్‌ టు స్కిన్‌ తీర్పుని కొట్టేసిన సుప్రీం

సాక్షి, న్యూఢిల్లీ: న్ని దుస్తుల పైనుంచి తాకినా అది లైంగిక వేధింపుల కిందకే వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లైంగిక వేధింపుల్లో ఆ ఉద్దేశమే ప్రధానం తప్ప శరీరాన్ని నేరుగా తాకారా, దుస్తులపై నుంచి తాకారా బాలిక శరీరాఅన్నది కాదని తేల్చి చెప్పింది. శరీరాన్ని నేరుగా తాకకపోతే (స్కిన్‌ టు స్కిన్‌ టచ్‌ జరగనపుడు)  లైంగిక వేధింపులు కావంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పుని గురువారం దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది.

ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌ (పోక్సో) చట్టంలోని సెకక్షన్‌ 7 ప్రకారం కామవాంఛతో బాలిక శరీరాన్ని ఎలా తాకినా లైంగిక వేధింపులుగానే పరిగణించాలని జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ లలిత్, జస్టిస్‌ రవీంద్ర భట్, జస్టిస్‌ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. సదరు కేసులో  నిందితుడిని దోషిగా ప్రకటించింది.

బాంబే హైకోర్టు తీర్పుని సవాల్‌ చేస్తూ అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్, జాతీయ మహిళా కమిషన్‌ దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు చట్టాలు స్పష్టంగా ఉన్నప్పుడు న్యాయస్థానాలు తమ తీర్పులతో గందరగోళం సృష్టించకూడదని పేర్కొంది. చిన్నారులను లైంగిక వేధింపుల నుంచి కాపాడడమే పోక్సో చట్టం ప్రధాన ఉద్దేశమని న్యాయమూర్తులు పేర్కొన్నారు. జస్టిస్‌ రవీంద్రభట్‌ తాను విడిగా తీర్పుని వెలువరిస్తూ ‘లైంగిక వేధింపుల్లో నిందితుడి ఉద్దేశమే ప్రధానం. చట్టంలో ఉన్న నిబంధనల్ని నిర్వీర్యం చేయకుండా మరింత శక్తిమంతంగా మారేలా తీర్పులనివ్వాలి. చట్టంలో అంశాలకు సంకుచితమైన వివరణలతో తీర్పులనివ్వడం ఆమోదయోగ్యం కాదు’ అని అన్నారు.  

ఎందుకు వివాదమైంది?  
2016లో నాగపూర్‌లో సతీష్‌ (36) అనే వ్యక్తి 12 ఏళ్ల బాలికకు జామకాయ ఆశ చూపించి తన ఇంటికి తీసుకువెళ్లాడు. బాలిక ఛాతిని తాకి దుస్తుల్ని విప్పడానికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో తల్లి అక్కడికి వచ్చింది. తల్లి ఫిర్యాదు మేరకు కింద కోర్టు నిందితుడ్ని దోషిగా తేలుస్తూ మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అతను హైకోర్టుని ఆశ్రయించగా శరీరాన్ని నేరుగా తాకలేదు కాబట్టి పోక్సో చట్టం కింద లైంగిక వేధింపులు కావంటూ ఈ ఏడాది జనవరిలో బాంబే హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ పుష్ప గనేడివాలా నిందితుడిని విముక్తి చేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఒక మహిళా న్యాయమూర్తి ఇలాంటి తీర్పునివ్వడం ద్వారా ఎలాంటి సంకేతాలు పంపుతున్నారంటూ మహిళా సంఘాలు తీర్పుని వ్యతిరేకించాయి. తీర్పుని సవాల్‌ చేస్తూ అటార్నీ జనరల్, జాతీయ మహిళా కమిషన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించగా జనవరి 27న సుప్రీంకోర్టు బాంబే హైకోర్టు తీర్పుని నిలిపివేసింది. ఇప్పుడు ఆ తీర్పుని కొట్టేస్తూ ఆదేశాలు జారీ చేసింది.   

మరిన్ని వార్తలు