ఏ ప్రాతిపదికన రూ.8 లక్షల పరిమితి విధించారు ?

8 Oct, 2021 05:58 IST|Sakshi

న్యూఢిల్లీ: నీట్‌ ప్రవేశాల్లో వైద్య విద్య కోర్సుల్లో చేరే ఆర్థికంగా వెనకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌) విద్యార్థులకు రూ.8 లక్షల వార్షిక ఆదాయం పరిమితిని కేంద్రం విధించడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఏ ప్రాతిపదికన రూ.8 లక్షల పరిమితిని వర్తింపజేశారో వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ బీవీ నాగరత్నల ధర్మాసనం ఆదేశించింది. రూ.8 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉంటేనే ఈడబ్ల్యూఎస్‌గా పరిగణిస్తామనడంపై  అఫిడవిట్‌ సమర్పించాలని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ, కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖలకు కోర్టు సూచించింది.

నేషనల్‌ కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌ను ఆధారంగా చేసుకుని ఆదాయ పరిమితిని నిర్ణయించామని, ఇది కేంద్ర ప్రభుత్వ విధానపర నిర్ణయమని ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ నటరాజ్‌ వివరణ ఇచ్చారు. దీనిపై  కోర్టు స్పందించింది. ‘వేర్వేరు రాష్ట్రాలు, పట్టణాల్లో జీవన వ్యయాలు వేరుగా ఉంటాయి. యూపీలోని చిన్న పట్టణాలతో పోలిస్తే ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో ఖర్చులు ఎక్కువ. అలాంటపుడు ఒకే రకమైన ఆదాయ పరిమితిని ఎలా విధిస్తారు? కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయం అని చెప్పి తప్పించుకోలేరు’ అని కోర్టు వ్యాఖ్యానించింది.  
     నీట్‌లో ఈడబ్ల్యూఎస్‌ కోటాకు వార్షిక ఆదాయ పరిమితిపై సుప్రీంకోర్టు

మరిన్ని వార్తలు