అప్పటికి మూడో వేవ్‌ ముగుస్తుంది: సుప్రీం కోర్టు

4 Sep, 2021 04:28 IST|Sakshi

కోవిడ్‌–19 డెత్‌ సర్టిఫికెట్‌ మార్గదర్శకాల జారీలో ఆలస్యం

కేంద్రం తీరుపై సుప్రీం అసంతృప్తి

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడం,  మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరుకు మార్గదర్శకాలు రూపొందించడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘కరోనా మరణాలకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించాలని మేము గతంలోనే ఆదేశించాం. ఆ తర్వాత గడువును పొడిగించాం కూడా. మీరు మార్గదర్శకాలు రూపొందించే సమయానికి మూడో వేవ్‌ కూడా ముగిసిపోతుంది’’ అని జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ అనిరుధ్‌ బోస్‌లతో కూడిన సుప్రీం డివిజన్‌ బెంచ్‌ వ్యాఖ్యానించింది. శుక్రవారం ఈ కేసుని విచారిస్తూ  మార్గదర్శకాలను ఈ నెల 11లోగా రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ నష్టపరిహారం అసలైన వారికి చేరాలంటే కోవిడ్‌–19 డెత్‌ సర్టిఫికెట్‌ జారీకి కూడా కేంద్రం మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందంటూ  కొందరు అడ్వకేట్లు గతంలోనే వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.

వాటిని విచారించిన సుప్రీం కోర్టు ఇప్పటికే మార్గదర్శకాల రూపకల్పనకు రెండు సార్లు గడువు పొడిగించింది. ఇక మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. మరణ ధ్రువీకరణ పత్రం జారీకి సంబంధించి మార్గదర్శకాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది.  కేంద్రం తరఫున కోర్టుకు హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఈ అంశం ఉందని సుప్రీం దృష్టికి తీసుకువెళ్లారు.

మరిన్ని వార్తలు