శివసేన గుర్తు ఎవరికి? 8 ప్రశ్నలు రూపొందించిన సుప్రీంకోర్టు

23 Aug, 2022 15:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: శివసేన అధికారిక గుర్తును ఉద్ధవ్ థాక్రే, ఏక్‌నాథ్ షిండే వర్గాల్లో ఎవరికి కేటాయించాలనే విషయాన్ని తేల్చేందుకు ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది సుప్రీంకోర్టు. ఈ వ్యవహారంపై మొత్తం 8 ప్రశ్నలను రూపొందించింది. ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గురువారం దీనిపై విచారణ జరిపి తీర్పు వెలువరించనుంది.

ఈ నేపథ్యంలో గురువారం వరకు శివసేన ఎన్నికల గుర్తు(విల్లు, బాణం)ను ఎవరికి కేటాయించాలనే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు సూచించింది.  శివసేన పార్టీ తమదే అని ఉద్ధవ్ థాక్రే, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. 

థాక్రే వర్గం దాఖలు చేసిన పిటిషన్లను తిరస్కరించి అసలైన శివసేన ఎవరిదో ఎన్నికల సంఘమే నిర్ణయించేందుకు అనుమతించాలని షిండే గతనెలలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శివసేన మెజార్టీ ఎమ్మెల్యేలు తనతోనే ఉన్నారని, పార్టీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోవద్దని కోరారు. మరోవైపు థాక్రే వర్గం కూడా శివసేన తమదే అని వాదిస్తోంది. పార్టీ విప్‌ను ధిక్కరించిన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్లో పేర్కొంది.
చదవండి: మునుగోడు కోసం తెలంగాణను తగలబెడతారా?: అసదుద్దీన్‌ ఒవైసీ ఫైర్‌

మరిన్ని వార్తలు