భిక్షాటనపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు

27 Jul, 2021 18:27 IST|Sakshi

న్యూఢిల్లీ: బిక్షాటనపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. భిక్షాటనను నిషేధించేందుకు ఉన్నత వర్గాలకు అనుకూలమైన పక్షపాత ధోరణిని ప్రదర్శించలేమంటూ స్పష్టం చేసింది. ఉపాధి లేకపోవడం వల్లే చాలామంది బిచ్చమెత్తుకోవడానికి వీథుల్లోకి వస్తున్నారని పేర్కొంది. ఇది సాంఘిక, ఆర్థిక సమస్య అని తెలిపింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ నేపథ్యంలో వీథుల్లో తిరిగే బిచ్చగాళ్ళకు, నిరాశ్రయులకు వ్యాక్సిన్లు వేయించాలనే అంశంపై కేంద్రానికి, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ట్రాఫిక్ కూడళ్లు, మార్కెట్లు, బహిరంగ స్థలాల్లో భిక్షాటనను నిరోధించాలని అడ్వకేట్ కుశ్ కల్రా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జరగిన వాదనల్లో అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు స్పందించింది. 

పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ చిన్మయ్ శర్మను ఉద్దేశించి జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. వీథుల్లోకి వచ్చి బిచ్చమెత్తుకోవాలని ఎవరూ కోరుకోరని, పేదరికం వల్లే వారు ఈ పని చేస్తున్నారని అన్నారు. అత్యున్నత న్యాయస్థానంగా తాము పక్షపాతంతో ఉన్నత వర్గాలకు అనుకూలంగా వ్యవహరించలేమని తెలిపారు. వీథులు, బహిరంగ స్థలాలు, ట్రాఫిక్ జంక్షన్ల నుంచి బిచ్చగాళ్ళను తొలగించాలని తాము ఆదేశించలేమని తేల్చి చెప్పారు. ఈ అంశంపై ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఉందని, దీన్ని పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు చర్యలు తీసుకుంటున్నాయో వివరించాలని ఆదేశించారు. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు