హైబ్రీడ్‌ మోడ్‌ కుదరదు: సుప్రీం

19 Nov, 2021 06:24 IST|Sakshi

సీబీఎస్‌ఈ, సీఐఎస్‌సీఈ బోర్డు

పరీక్షలు ప్రత్యక్షంగా రాయాల్సిందే

న్యూఢిల్లీ:  సీబీఎస్‌ఈ, సీఐఎస్‌సీఈ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల్లో హైబ్రీడ్‌ విధానం(ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌) కుదరని, విద్యార్థులు ప్రత్యక్షంగా పరీక్షలకు హాజరు కావాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. విద్యా వ్యవస్థను గందరగోళానికి గురి చేయవద్దని పేర్కొంది. సీబీఎస్‌ఈ టర్న్‌–1 బోర్డు పరీక్షలు నవంబర్‌ 16 నుంచి ప్రారంభమయ్యాయని, సీఐఎస్‌సీఈ సెమిస్టర్‌–1 పరీక్షలు 22 నుంచి ప్రారంభం కాబోతున్నాయని గుర్తుచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం పరీక్షల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని వెల్లడించింది. 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలను కేవలం ఆఫ్‌లైన్‌లో కాకుండా హైబ్రీడ్‌ మోడ్‌లో నిర్వహించేలా సీబీఎస్‌ఈ, సీఐఎస్‌సీఈకి ఆదేశాలివ్వాలని కోరుతూ ఆరుగురు విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్‌ ఎం.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. సీబీఎస్‌ఈ తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. కోవిడ్‌–19 నియంత్రణ నిబంధనలను పాటిస్తూ బోర్డు పరీక్షలను ప్రత్యక్ష విధానంలో(ఆఫ్‌లైన్‌ మోడ్‌) నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. విద్యార్థుల సౌకర్యార్థం పరీక్ష కేంద్రాలను 6,500 నుంచి 15,000కు పెంచామని తెలిపారు. పిటిషనర్ల తరపున సీనియర్‌ అడ్వొకేట్‌ సంజయ్‌ హెగ్డే హాజరయ్యారు. ఇప్పటికే ఆలస్యం జరిగిందని, ఈ దశలో పరీక్షలను రీషెడ్యూల్‌ చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆయనకు తెలియజేసింది. విద్యా వ్యవస్థతో ఆటలు వద్దని, అధికారులను వారి పని వారిని చేసుకోనివ్వాలని హితవు పలికింది.  

మరిన్ని వార్తలు