అనిల్‌ దేశ్‌ముఖ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

9 Apr, 2021 06:25 IST|Sakshi

న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌దేశ్‌ముఖ్‌కు గురువారం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అనిల్‌ దేశ్‌ముఖ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తును ఆదేశిస్తూ బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం, అనిల్‌దేశ్‌ముఖ్‌ దాఖలు చేసుకున్న పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హోంమంత్రిగా ఉన్న సమయంలో అనిల్‌ దేశ్‌ముఖ్‌ ముంబైలోని పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్ల నుంచి నెలకు 100 కోట్లు వసూలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారని ముంబై మాజీ సీపీ పరమ్‌వీర్‌æ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

‘ఆరోపణలను చూస్తే వీటిపై స్వతంత్ర సంస్థ దర్యాప్తు చేయడమే మంచిదని భావిస్తున్నాం’ అని  ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకోవాలనుకోవడం లేదంది. ‘ఒక సీనియర్‌ మంత్రిపై ఒక సీనియర్‌ పోలీసు అధికారి చేసిన తీవ్రమైన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేయడం సరైనదే’ అని పేర్కొంది. మౌఖికంగా, ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తును ఆదేశించడం సరికాదని అనిల్‌ తరఫున వాదించిన సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ పేర్కొన్నారు. ఆధారాలు లేని ఆరోపణలపై, మంత్రి వాదన వినకుండానే బొంబాయి హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందన్నారు. ‘ప్రస్తుతం సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌ నేతృత్వంలో నడుస్తోంది. ఆ నియామకానికి సంబంధించిన పిటిషన్‌ కూడా ఇదే కోర్టులో విచారణలో ఉంది’ అని సిబల్‌ వివరించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు